విశాఖ మన్యంలోని కొయ్యూరు ప్రాంతంలో ఎదురు కాల్పుల్లో మృతి చెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు గురువారం రాత్రి నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి చేరుకున్నాయి. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను ఫ్రీజర్ బాక్స్‌లలో భద్రపరిచారు. గురువారం రాత్రికి ఆస్పత్రికి మృతదేహాలు చేరుకోవడంతో.. ఇవాళ పోస్టుమార్టం నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు.
అసలేం జరిగింది..!
కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలోని యు.చీడిపల్లి పంచాయతీ తీగలమెట్ట వద్ద దట్టమైన అటవీ ప్రాంతంలో 30 మంది మావోయిస్టులు ఆశ్రయం పొందినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. అక్కడికి సమీపాన కూంబింగ్ చేస్తున్న గ్రేహౌండ్స్ బలగాలు అప్రమత్తమై మంగళవారం రాత్రే అటువైపు వెళ్లాయి. ముందు ఒక బృందం వెళ్లాక.. అటవీ ప్రాంతం నలువైపులా పోలీసు బలగాలను మోహరించారు. ఉదయం 9.30 ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువైపుల నుంచి కాల్పులు జరిపారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. ఘటనా స్థలం నుంచి ఏకే-47, కార్బన్, .303 రైఫిల్, తపంచా, ఎస్‌బీబీఎల్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీచదవండి.