విశాఖ 14వ వార్డులోని మారుతీనగర్ పోలింగ్ కేంద్రం-11లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. జీవీఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. గత ఎన్నికల్లో యాభై శాతం మించి పోలింగ్ నమోదు కాలేదని... ఈసారి ఓటింగ్ శాతం పెరగాలని ఆకాంక్షించారు. 14వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న సబ్బం హరి, విజయసాయిరెడ్డి.. పరస్పరం తారసపడ్డారు. మర్యాదపూర్వకంగా పలకరించిన సబ్బం హరికి దండం పెడుతూ ముందుకు కదిలారు విజయసాయిరెడ్డి.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎంవీపీ కాలనీలోని 17వ వార్డులో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు అందరూ ఓటు వేయాలని కోరారు. జీవీఎంసీ ఎన్నికలలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు... మాజీ ఐపీఎస్ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ. ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యతన్న ఆయన... ఓటింగ్ శాతం పెరగకపోతే ప్రశ్నించే హక్కు ఉండదన్నారు.