కరోనా ప్రభావం రోజురోజుకు తీవ్రమవుతున్న తరుణంలో విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజి ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నేరుగా ప్రధానమంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చింది. విశాఖలో తెల్లవారుజాము నుంచి జరిగిన పరిణామాలు, చేపట్టాల్సిన కార్యచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
విశాఖలో చేపడుతున్న కార్యక్రమాలను నిత్యం పర్యవేక్షించాలని ప్రధాని కార్యాలయ ముఖ్య కార్యదర్శి పి.కె. మిశ్రాను ఆదేశించారు. ఈ క్రమంలో ఏపీకి కేంద్రం నుంచి ఏ సహకారమైనా అందించాలని ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎన్డీయమ్ఏ, హోం శాఖ సహా ముఖ్యమైన అధికారులకు మిశ్రా సూచించారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలన్నారు.
అసలు ఎల్‌జీ ఫ్యాక్టరీలో ఏం జరిగిందో తెలుసుకోవాలని, మొత్తం పరిణామాలపై పూర్తి నివేదిక అందించాలని ప్రధాని కార్యాలయం ఆదేశించినట్లు సమాచారం. అలాగే సహాయక చర్యలను ప్రధాని కార్యాలయమే స్వయంగా మానిటర్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రధాని కార్యాలయం, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, రసాయన శాఖ కార్యదర్శి నలుగురు సమన్వయం చేసుకుంటూ... వైజాగ్ గ్యాస్ లీకేజి ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలను స్వయంగా పర్యవేక్షించాలని నిర్ణయం తీసుకున్నారు.