ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విశాఖలో గణనీయంగా తగ్గిపోతున్న లింగ నిష్పత్తి'

ఆకాశంలో సగం.. సృష్టి మనుగడకు కారణం ఆమెనే. ఆమె కాలుమోపని ప్రాంతం లేదు. ఆమె ప్రాతినిద్యం లేని రంగమే లేదు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మహిళలు రాణిస్తూ పురుషులకు సమఉజ్జీలుగా నిలుస్తున్నారు. అయినా ఈ రోజుకూ కొన్ని చిక్కుముడులు వీడడం లేదు. ‘అమ్మాయి..అబ్బాయి ఎవరెక్కువ..? ఎవరు తక్కువ..? అంటే ప్రతి తల్లిదండ్రులు వాళ్లు తమకు రెండు కళ్లు అని చెబుతారు. లోలోపల ఎక్కడో ఆడప్లిలంటే తెలీయని భయం. ఎలా పెంచాలి..? ఎలా పెద్ద చేయాలి..? పెళ్లి చేసి పంపాలనే ఆందోళన నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. వీటికి తోడు సామాజిక, ఆర్థిక పరిస్థితులు తల్లిదండ్రులను లింగ వివక్ష వైపు తీసుకు వెళుతున్నాయి. ఇటీవల వెల్లడైన ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-20) ఇదే చెబుతోంది.

National Family Health Survey
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే

By

Published : Dec 17, 2020, 7:55 AM IST

Updated : Dec 17, 2020, 8:02 AM IST

రాష్ట్రస్థాయిలో లింగ నిష్పత్తి పెరిగినా.. విశాఖ జిల్లాలో ఇది గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వెల్లడయిన 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-20) ఇదే చెబుతోంది. 2015-16లో పుట్టినప్పుడు లింగ నిష్పత్తి 1000 మంది బాలురకు 1,097 మంది బాలికలు ఉండేవారు. 2019-20 నాటికి వచ్చేసరికి 974 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. అదే సమయంలో పెద్దల్లో ప్రతి వెయ్యి మందికి 1,047 మంది మహిళలుంటే 2019-20 నాటికి వారి సంఖ్య 1,066కి పెరగడం విశేషం. దీన్నిబట్టి చూస్తే ఈ అయిదేళ్లలోనే పుట్టకదశలో ఆడపిల్లలు లింగ వివక్షను ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. లింగ నిష్పత్తిలో 123 మంది తగ్గిపోవడం సాధారణమైన విషయం కాదని సంబంధిత నిపుణులంటున్నారు.

జిల్లాలో ఏటా 80 వేలకు పైగా గర్భిణులు ఆరోగ్య కేంద్రాల్లో నమోదవుతుంటారు. 95 శాతం ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. ఏజెన్సీ మూలంగా మిగతా జిల్లాలతో పోల్చితే మాతా శిశుమరణాల రేటు ఎక్కువగానే ఉంటుంది. తాజాగా లింగ వివక్షలోను అంతరంగం భారీగా పెరగడం వైద్యారోగ్యశాఖను ఆందోళనకు గురిచేస్తోంది. పెదరికం, నిరక్ష్యరాస్యత, నిరుద్యోగం, సామాజిక కట్టుబాట్లు, సమాజ నడవడిక, మహిళా శక్తి గురించి అవాగాహన లేకపోవడం వల్లే లింగ వివక్ష పెరగడానికి కారణంగా భావిస్తున్నారు. ఆరోగ్యరంగంలో పెరిగిన సాంకేతిక పరిజ్ఞానంతో పుట్టబోయే బిడ్డ ఆడ, మగ ముందే తెలుసుకుంటున్నారు. ఆడపిల్లలయితే కడుపులోనే మాయం చేసే వారూ ఉన్నారు. బ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షల పట్ల కఠిన చట్టాలు చేసినా అమలులో మాత్రం కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 520కి పైగా నిర్థారణ కేంద్రాలు ఉన్నాయి. వాటిని ఎప్పటికపుపడు పరిశీలించి ఈ తరహా చర్యలపై హెచ్చరిస్తూ ఉండాలి. కాని వాటిని పరిశీలించడానికే అధికారులకు సమయం ఉండడం లేదు. ఈ కారణంగానే లింగ నిష్పత్తిలో వ్యత్యాసం పెరిగినట్లు తెలుస్తోంది.

తగ్గిన ఆడపిల్లల బాల్య వివాహాలు..

గతంతో పోల్చితే జిల్లాలో బాల్య వివాహాలు తగ్గాయి. 2015-16లో 29.2 శాతం మంది 18 ఏళ్లకు ముందుగానే ఆడపిల్లలు పెళ్లిచేసుకునేవారు. 2019-20లో వారి శాతం 25.4 శాతానికి తగ్గింది. అలాగే 15-24 ఏళ్ల మధ్య యువతులు రుతుస్రవం సమయంలో ఆరోగ్యవంతమైన పద్ధతుల పాటించేవారి సంఖ్య పెరిగింది. అప్పట్లో 68.3 శాతం మంది ఆరోగ్య పద్ధతులు పాటిస్తే తాజాగా వారి సంఖ్య 85.7 శాతానికి పెరిగింది. పాఠశాలకు వెళ్లేవారిలో ఆరేళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న అమ్మాయిల శాతం గతంలో 61.3 శాతం ఉంటే ఇప్పుడు 66.8 శాతానికి పెరిగింది. 15 ఏళ్లలోపు వయసున్నవారి జనాభా 2015-16లో 23.3 శాతం ఉంటే ఇప్పుడు 21.4 శాతానికి తగ్గిపోవడం విశేషం.

* మొదటి త్రైమాసికంలోనే ప్రసూతి పరీక్షలు చేయించుకుంటున్న వారి సంఖ్య 77.9 శాతం నుంచి 79.4 శాతానికి పెరిగింది.

* రక్తహీనతను నివారించే ఐరన్, ఫోలిక్‌ యాసిడ్‌ వినియోగించి గర్భిణుల సంఖ్య 55 శాతం నుంచి 75 శాతానికి పెరిగింది.

* ఆసుపత్రి ప్రసవాల సంఖ్య 84.9 శాతం నంచి 95.3 శాతానికి పెరిగింది.

* సిజేరియన్‌ ప్రసవాలు గతంలో 35.5 శాతం ఉంటే ప్రస్తుతం 26.5 శాతానికి తగ్గాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో 57.2 శాతం సిజేరియన్లు జరుగుతుంటే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16.8 శతం సిజేరియన్‌ ద్వారా ప్రసవాలు జరుగుతున్నాయి.

* పిల్లలకు వ్యాక్సినేషన్‌ విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధచూపిస్తున్నారు. 12 నుంచి 23 నెలల చిన్నారులకు అందించే అన్ని రకాల వ్యాక్సిన్లను తీసుకోవడంలో గతంలో ఎక్కువగానే తీసుకుంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్‌ తీసుకునే వారి సంఖ్య 7.7 శాతం నుంచి 9.7 శాతానికి పెరిగింది. విటమిన్‌ ఏ తీసుకునే చిన్నారులు 63 శాతం నుంచి 91 శాతానికి పెరిగారు.

* పుట్టిన గంటలోనే తల్లిపాలు పట్టిన వారి శాతం 58 నుంచి 64.3 శాతానికి పెరిగింది. చిన్నారుల్లో పెరిగిన రక్తహీనత..

* 6 నుంచి 59 నెలల మధ్య చిన్నారుల్లో గతంలో 64.5 శాతం రక్తహీనతతో ఉండేవారు..తాజాగా వారి శాతం 72.6 శాతానికి పెరిగింది.

* 15 నుంచి 49 ఏళ్ల మధ్యలోని మహిళల్లో రక్తహీనత గతంలో 66.4 శాతం మందిలో ఉంటే తాజాగా వారి శాతం 58 శాతానికి తగ్గింది.

* మధుమేహం, రక్తపోటు విషయంలో మహిళలు కంటే మగవాళ్లలోనే ఎక్కువ మంది బాధితులున్నారు.

* 30 నుంచి 49 ఏళ్ల మధ్యలోని మహిళల్లో 1.7 శాతమందిలో సర్వైకల్‌ క్యాన్సర్, 0.7 శాతం మందిలో బ్రెస్ట్‌ క్యాన్సర్, 4.1 శాతం మందిలో నోటి క్యాన్సర్‌ బాధితులున్నారు. స్కానింగ్‌ కేంద్రాలపై నిఘాలేదు.

"జిల్లాలో ఇబ్బడి ముబ్బడిగా స్కానింగ్‌ కేంద్రాలున్నాయి. లింగా నిర్ధారణ పరీక్షలు నేరమని చట్టం తెచ్చినా ఇప్పటి వరకు ఎక్కడా ఒక్కకేసు నమోదు కాలేదు. అయినా ఆడపిల్లల సంఖ్య తగ్గడం ఆందోళన కరమే. పాఠశాలల్లో ఆడ,మగ సమానత్వంపై అవగాహనా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది".

-ఎ.సత్యన్నారాయణ, జిల్లా బాలల సంరక్షణాధికారి.

"గతంలో కంటే ఇప్పుడు లింగ బేధాలు చూడడంలో వ్యత్యాసం తగ్గింది. అయినా జాతీయ కుటుంబ సర్వే నివేదికలో బాలికలు తగ్గిపోతున్నారని పేర్కొంది. అంటే ఆ నివేదికను ఓసారి విశ్లేషించాల్సి ఉంటుంది. మండలాలు, గ్రామాలు వారీగా ఎక్కడెక్కడ లింగనిష్ఫత్తిలో తేడా ఎక్కువ కనిపిస్తే అక్కడ ప్రత్యేకంగా దృష్టిసారించాలి. లింగ వివక్షపై గ్రామాల్లో అవగాహన కార్యాక్రమాలను చేపడుతున్నాం". - డా. విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో

ఇదీ చదవండి :బాలయోగి బాలుర గురుకులలో విజిలెన్స్ తనిఖీలు

Last Updated : Dec 17, 2020, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details