విశాఖ జిల్లాలో పురపాలక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు శానిటైజర్లు వాడేలా ఏర్పాట్లు చేశారు.
నర్సీపట్నంలో
విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 28 వార్డులకు.. 47, 389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు 18, సాధారణ సమస్యాత్మక ప్రాంతాలు 22గా గుర్తించారు. ఇందుకోసం 374 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు. 56 బ్యాలెట్ బాక్స్ లను ఏర్పాటు చేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద బొడ్డేపల్లి, శారదానగర్, బలిఘట్టం తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. నర్సీపట్నం శారదానగర్ 16b పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియ అరగంటసేపు ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటల వరకు 22 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు నేతలు
నర్సీపట్నం ఐదు రోడ్ల కూడలి వద్ద 25వ వార్డులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. ఓటు హక్కును వినియోగించుకున్నారు. శారదా నగర్లోని 16వ పోలింగ్ బూతు వద్ద నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనకాపల్లిలో
అనకాపల్లి జీవీఎంసీ జోన్ పరిధిలోని 5 వార్డులకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో పలు పార్టీల నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 14 వార్డులో.. మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.. కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కును వినయోగించుకున్నారు. ప్రజలు సక్రమంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.