అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటే భాజపా ఎంతకైనా దిగజారుతుందని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. భాజపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై సవతి తల్లి ప్రేమ చూపుతోందన్నారు. ఈ పక్షపాత ధోరణి పనికిరాదని సమావేశంలో స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు.
పుదుచ్చేరి ఎన్నికల సమయంలో భాజపా మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా అంశాన్ని ఎలా పెట్టారని అఖిలపక్ష సమావేశంలో మంత్రులను ప్రశ్నించినట్లు తెలిపారు. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇవ్వగలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఎందుకు ఇవ్వలేరని, భాజపా రాష్ట్రాలకు ఏమైనా చేస్తారు, భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మొండిచేయి చూపుతారని చెప్పామన్నారు. పోలవరం పునరావాస ప్యాకేజీకి రూ.55,657 కోట్లు రావాల్సి ఉన్నా కేంద్రం ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సాంకేతిక కమిటీ ఆమోదించినా నిధులు పెండింగ్‌లో పెట్టడం రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న ద్రోహం అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు అథారిటీని హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తరలించాలని కోరినా స్పందించనందున ఈ అంశాన్ని ఉభయసభల్లో ప్రస్తావిస్తామని తెలియజేశామని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని, సంస్థను లాభాల్లోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం కాల పరిమితి పదేళ్లయితే ఇప్పటికే ఎనిమిదేళ్లయినా చాలా హామీలు నెరవేర్చలేదనే విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని పునర్విభజన చట్టంలో పొందుపర్చినా భాజపా ప్రభుత్వం ఆ చట్టానికి లోబడకుండా తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.
రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, బియ్యం రాయితీ కింద రూ.5,056 కోట్లు, ఉపాధిహామీ నిధులు రూ.6,750 కోట్లు బకాయిపడినందున ఆ మొత్తం విడుదల చేయాలని కోరామన్నారు. వంశధార ట్రైబ్యునల్ తీర్పుపై గెజిట్ విడుదల చేయాలని, దిశ బిల్లును ఆమోదించాలని కోరినట్లు చెప్పారు. పోలవరం, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి నిధుల విషయంలో భాజపా ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆయన ఆరోపించారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఇతర రాష్ట్రాల్లో 70 నుంచి 75 శాతం మందికి రేషన్ కార్డులు ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 60 శాతం మందికి లేవని, ఈ వ్యత్యాసాన్ని సరిచేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరామన్నారు.