కుమారుడు పల్లాను చూసి తల్లడిల్లిన తల్లి మనసు - visakhapatnam district newsupdates
గాజువాకలో ఆమె కుమారుడు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు. అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉన్న ఆ తల్లి ఎలాగో ఓపిక తెచ్చుకుని ఆ దీక్షా శిబిరానికి చేరుకుంది. నీరసించిన కొడుకును చూసి బోరున విలపించింది.
విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఆమె కుమారుడు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చున్నారు. అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉన్న ఆ తల్లి ఎలాగో ఓపిక తెచ్చుకుని ఆ దీక్షా శిబిరానికి చేరుకుంది. అక్కడ నీరసించిన కొడుకును చూసి తట్టుకోలేక బోరున విలపించింది. ఈ ఘటన పాత గాజువాకలోని తెదేపా కార్యాలయంలో చోటుచేసుకుంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆమరణ దీక్ష చేస్తున్న విషయం విదితమే. ఆయన ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఆయన తల్లి మహాలక్ష్మి గత నెల రోజులుగా ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు ఇంటిపట్టునే ఉండమన్నారు. ఈ నేపథ్యంలో శ్రీనుబాబు దగ్గరకు తీసుకెళ్లమని ఆమె ఒత్తిడి తేవడంతో కుటుంబసభ్యులు కారులో దీక్షా శిబిరానికి తెచ్చారు. అక్కడ కుమారుడిని చూసి ఆమె విలపించడంతో.. పల్లా భావోద్వేగానికి లోనయ్యారు. ‘ఆరోగ్యం జాగ్రత్త నాయనా..’ అంటూ ధైర్యం చెప్పి తల్లి మహాలక్ష్మి వెనుదిరిగారు. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ కదిలించింది.