Comments on Andhra Pradesh capital city : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశం మంత్రులకూ అంతుచిక్కడం లేదని తెలుస్తోంది. రోజుకో తీరుగా.. ఎవరికి వారు.. ప్రాంతం, సందర్భం, సమావేశాలకు అనుగుణంగా నిర్వచించడం ఇందుకు అద్దం పడుతోంది. అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించడం విదితమే. అప్పట్లోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. విశాఖపట్నం నగరాన్ని కార్యనిర్వహణ కేంద్రంగా, కర్నూలును న్యాయశాఖ కేంద్ర బిందువుగా, శాసనసభ పరంగా అమరావతిని రాజధానిగా ప్రకటించారు.
ఎవరికి వారు.. మూడు రాజధానులపై మంత్రులు తమ భాష్యాలను యధావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎవరికి నచ్చినట్టు వారు వివరణ ఇస్తూనే.. అది తీసుకునే వారిని బట్టి అర్థాలు ఉంటాయని చెబుతున్నారు. దీనిపై మంత్రి గుడివాడ అమర్నాథ్ను విశాఖలో మీడియా వివరణ అడిగినపుడు స్పందించారు. ఇదే అంశంలో ప్రభుత్వం ఎప్పుడూ ఒకే మాట మీద ఉందని అన్నారు. చెప్పడంలో కొంత తేడాలు ఉన్నప్పటికీ.. అర్థం చేసుకునే వారిలో తేడాలను బట్టే వీటికి బహుళంగా పలు అంశాలు ప్రచారంలోకి వస్తున్నాయన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అన్న విషయంలో ఎటువంటి తేడా లేదన్నారు.