కరోనా చికిత్స కోసం గుంటూరు నుంచి విశాఖ వచ్చిన ఓ మహిళ.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. విశాఖ జిల్లా ఎలమంచిలి సమీపాన జాతీయ రహదారిపై మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిబంద వద్ద ముందువెళ్తున్న లారీని అతివేగంతో వస్తున్న వీరి కారు ఢీ కొనడంతో.. శ్రీనివాసరావు తల్లి మోదకూరు తులసి (80) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎస్సై నర్సింగరావు.. మృతదేహాన్ని బయటకు తీసి క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి 8 గంటలకు స్పృహలోకి వచ్చిన శ్రీనివాసరావు.. చికిత్స కోసం తీసుకొచ్చిన తల్లిని కోల్పోయానని బోరున విలపించారు. గుంటూరులో తప్పుడు నివేదిక రావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అక్కడే కరోనా లేదని తెలిస్తే ఇంతదూరం వచ్చేవారం కాదని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చదవండి:బెడ్ రాకెట్ గుట్టు రట్టు.. అందుబాటులో 3వేల పడకలు