JANASENA LEADERS ALLEGATIONS ON MINISTER AMARNATH : విశాఖ నగరంలో ప్రభుత్వ భూములను మింగేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపై పడ్డారని అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ నేతలు డి.గోపి, గోవింద్ ఆరోపించారు. ఈ భూదందాలన్నీ స్థానిక మంత్రి గుడివాడ అమర్‌నాథ్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. విశాఖలో గురువారం విలేకరులతో వారు మాట్లాడారు.
‘కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధి విస్సన్నపేటలోని సర్వేనంబరు 195/2లో 609 ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా కొన్నారు. అమ్మడానికి ఇష్టపడని రైతుల ఖాతాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి ఇబ్బందుల్లోకి నెట్టి వారే స్వయంగా భూములు అమ్ముకునేలా ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ భూములనూ ఆక్రమించారు. గెడ్డలు కప్పేశారు. కొండలను పిండి చేశారు. వీటిపై పత్రికల కథనాల ఆధారంగా లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది.
మంత్రికి చెందిన రియల్ వెంచర్ అయినందున చర్యలకు అధికారులెవరూ సాహసించడం లేదు. స్థానిక తహసీల్దారును బదిలీ చేయాలని గతంలోనే ఏసీబీ డీజీ స్థాయి అధికారి సిఫార్సు చేసినా.. వైకాపాకు అనుకూలంగా ఉన్నారని చర్యలు తీసుకోలేదు. ఇక్కడి భూములను వైకాపా ముఖ్య నాయకుడి సన్నిహితుడికి చెందిన ఒక సంస్థ వారు కొన్నారు. ఈ వ్యవహారాల్లో మంత్రి అమర్‌నాథ్‌తోపాటు గవర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బొడ్డడ ప్రసాద్, మరో మంత్రి మేనల్లుడి పాత్ర ఉంది.
జిరాయితీ భూముల్లో స్థిరాస్తి వ్యాపారానికి అన్ని అనుమతులు కావాలి. ఈ భారీ లేఅవుట్‌కు ఎలాంటి అనుమతులు లేకుండానే బ్రోచర్లు విడుదల చేశారు. వీటిని ఎవరైనా కొంటే నష్టపోతారు. ఈ భూములే కాదు.. అనకాపల్లిలోని తుమ్మపాల చక్కెర కర్మాగారం, దేవాదాయ భూములనూ దోచుకోవడానికి చూస్తున్నారు’ అని జనసేన నేతలు ఆరోపించారు. ఈ భూదందాలపై మంత్రి బహిరంగ చర్చకు వస్తే సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రి అమర్‌నాథ్ పాత్ర ఉన్న ఈ భూఅక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.