ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని, ఉత్తరాంధ్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులను డమ్మీలుగా చేసి వారి అధికారాలను కూడా ఆయనే చెలాయిస్తున్నారని జనసేన పార్టీ నేత పీతల మూర్తి యాదవ్ విశాఖలో ఆరోపించారు. ఉత్తరాంధ్రలో కీలకమైన, విలువైన స్థలాలను గుప్పిట్లో పెట్టుకున్న విజయసాయిరెడ్డి.. ఇప్పుడు ముడసర్లోవ పార్కుపై దృష్టి సారించారని విమర్శించారు. ముడసర్లోవ పార్కును పీపీపీ పద్ధతిన కేటాయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో .. అభివృద్ధి పేరుతో 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విలువైన పార్కు స్థలాన్ని తనవారికి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్లో ముడసర్లోవ పార్కు అభివృద్ధికి సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టగా కౌన్సిల్లో వ్యతిరేకించామని గుర్తు చేశారు. విజయసాయిరెడ్డి చెప్పు చేతల్లో మగ్గుతున్న వైకాపా కౌన్సిల్ సభ్యులు స్థానిక ప్రయోజనాలకు భంగం వాటిల్లుతున్నా సరే పట్టించుకోకుండా ఆమోదించారని అన్నారు. పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టును చేపట్టేందుకుగాను కేవలం డీపీఆర్ వరకు మాత్రమే తయారు చేస్తామని చెప్పి ఇప్పుడు విజయసాయిరెడ్డి అధికారుల బృందంతో పార్కులో పర్యటించడం తెర వెనుక జరుగుతున్న తతంగానికి నిదర్శనమని మూర్తియాదవ్ మండిపడ్డారు. ముడసర్లోవ పార్కుని యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరీకరణ పనులపై ఆదేశాలు ఇవ్వడానికి విజయసాయిరెడ్డి ఎవరని ప్రశ్నించారు.
ప్రశాంత విశాఖలో ఫ్యాక్షనిస్ట్ తరహా పాలన సాగిస్తున్నారు - విజయసాయిరెడ్డిపై జనసేన విమర్శలు
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకి తనే ముఖ్యమంత్రి లాగా భావిస్తూ ఇష్టానుసారం వ్యవస్థలపై పెత్తనం చెలాయిస్తున్నారని జనసేన నేత విమర్శించారు. ముడసర్లోవ పార్కుని యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి, సుందరీకరణ పనులపై ఆదేశాలు ఇవ్వడానికి విజయసాయిరెడ్డి ఎవరని ప్రశ్నించారు.
మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా లేకుండా పర్యటన చేయడమేంటని నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లకు పూచికపుల్ల పాటి విలువ ఇవ్వకుండా అంతా తన కనుసన్నలలోనే జరిగేలా ప్రశాంత విశాఖలో పక్కా ఫ్యాక్షనిస్ట్ తరహా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.ఆయన ఇదే తరహాలో నియంతృత్వ పాలన సాగిస్తే ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు తిరిగి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మూర్తి యాదవ్ హెచ్చరించారు.
ఇదీ చూడండి.యువకుడి దారుణ హత్య.. ముక్కలుగా నరికి చంపాడు.. కుమార్తెను ప్రేమించాడనే..