ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దర్జీ.. డ్రైవర్‌.. వ్యాపారి.. ఐఎస్‌ఐ ఏజెంట్‌

విశాఖ గూఢచర్య రాకెట్ కేసును దర్యాప్తు చేసే కొద్దీ.. ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వస్త్ర వ్యాపారం సాకుతో పాకిస్థాన్​తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్న నిందితుడు... ఆ ముసుగుతోనే ఐఎస్ఐ ఏజెంటుగా కార్యకలాపాలు నిర్వహించేవాడు.

isi
ఐఎస్‌ఐ ఏజెంట్‌

By

Published : Mar 13, 2021, 9:43 AM IST

తనో లేడీస్‌ టైలర్‌. తర్వాత ఆటో డ్రైవర్‌ అవతారమెత్తాడు. ఆ పనిచేస్తూనే సరిహద్దు వస్త్ర వ్యాపారంలోకి దిగాడు. ఆ ముసుగులో కొనసాగుతూనే ఐఎస్‌ఐ ఏజెంట్‌గా మారాడు. వారు చెప్పినట్టల్లా ఆడుతూ.. భారతీయ నౌకాదళం ఉద్యోగుల్ని ఉచ్చులోకి లాగాడు. వారి ద్వారా సేకరించిన దేశ భద్రత రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేతలో కీలకంగా వ్యవహరించాడు. గుజరాత్‌లోని పంచమహల్‌ జిల్లా గోద్రా ప్రాంతానికి చెందిన యాకూబ్‌ ఇమ్రాన్‌ గిటేలి(37) ‘ఉగ్ర’ కథ ఇది.

విశాఖపట్నం గూఢచర్య రాకెట్‌ కేసులో గతేడాది సెప్టెంబరులో అరెస్టయిన అతనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విజయవాడలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో శుక్రవారం అభియోగపత్రం దాఖలు చేసింది. ఈ కేసులో 11 మంది నేవీ ఉద్యోగులు సహా మొత్తం 14 మంది ప్రమేయంపై ఇప్పటికే ఒక అభియోగపత్రం దాఖలు చేసిన ఎన్‌ఐఏ తాజాగా మరో అనుబంధ అభియోగపత్రాన్ని వేసింది.

అసఫ్‌ చెప్పాడు.. యాకూబ్‌ చేశాడు

లేడీస్‌ టైలర్‌గా పనిచేసే యాకూబ్‌ ఇమ్రాన్‌ గిటేలీ వెన్నునొప్పితో ఆ పని మానేశాడు. తర్వాత ఆటో తిప్పుతూ జీవనోపాధి పొందేవాడు. ఈ క్రమంలో కరాచీ వస్త్రాలను భారత్‌కు సరఫరా చేసే ముసుగులో మనదేశంలో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న అసఫ్‌తో అతనికి పరిచయమైంది. యాకూబ్‌ క్రమంగా అసఫ్‌ గుప్పిట్లోకి వెళ్లిపోయి అతను చెప్పిందల్లా చేస్తుండేవాడు. అందులో భాగంగా విశాఖపట్నం, కార్వర్‌, ముంబైల్లోని నౌకా దళ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేశాడు. వారి నుంచి దేశంలోని కీలక సంస్థలు, రక్షణ స్థావరాలు, అంతరిక్ష పరిశోధన కేంద్రాల ఫోటోలు, వీడియోలతోపాటు ఇతర రక్షణ రహస్యాలు, వ్యూహాత్మక స్థావరాల వివరాలను సేకరించాడు.

వాటివి పాకిస్థాన్‌ నిఘా విభాగానికి ఎప్పటికప్పుడు చేరవేసేవాడు. ఇందుకు ప్రతిఫలంగా నేవీ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసేవాడు. ఉగ్రకార్యకలాపాలకు అవసరమైన నిధులను యాకూబ్‌ వస్త్ర వ్యాపారం ముసుగులో సమీకరించేవాడు. అతనికి పాకిస్థాన్‌లోని కరాచీలో బంధువులున్నారని... వారి ద్వారా అసఫ్‌ పరిచయమైనట్లు ఎన్‌ఐఏ భావిస్తోంది. భారత్‌లో ఉగ్రకార్యకలాపాలు చేపట్టాలనే వ్యూహాల్లో భాగంగా యాకూబ్‌ గతేడాది వ్యవధిలో దేశంలోని వివిధ వ్యక్తుల ఖాతాల్లోకి రూ.65 లక్షలను బదిలీ చేసినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న అతనికి ఇంత భారీ మొత్తంలో డబ్బు పాకిస్థాన్‌ నుంచే అందినట్లు నిర్ధారించింది.

అందర్నీ నడిపించింది ఇక్బాల్‌ దోబా

ఈ గూఢచర్య రాకెట్‌ కేసులో ఇప్పటికే అరెస్టయిన మహ్మద్‌ హరూన్‌, సాహిస్తా కైజర్‌లు ఇక్బాల్‌ దోబా అనే వ్యక్తితో సంబంధాలు కొనసాగించారని ఎన్‌ఐఏ తేల్చింది. పాకిస్థాన్‌కు చెందిన ఇక్బాల్‌ దోబాకు అసఫ్‌ ప్రధాన అనుచరుడని... అతనే యాకూబ్‌ను హ్యాండ్లర్‌గా వినియోగించుకున్నాడని గుర్తించింది. యాకూబ్‌ కూడా అతనితో పలుమార్లు వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడినట్లు పేర్కొంది. ఇక్బాల్‌ ఇంకా ఎంతమందితో సంబంధాలు కొనసాగించాడన్న దానిపైనా ఎన్‌ఐఏ ఆరా తీస్తోంది.

ఇదీ చదవండి:

కడప ఉక్కుకు చిక్కులు?

ABOUT THE AUTHOR

...view details