విశాఖ మన్యం హుకుంపేట మండలం సంతారి పంచాయతీలోని చిన్న బూరుగుపుట్టులో దేవుడు వద్ద పెట్టిన దీపం వల్ల ఒక ఇంట్లోని సామగ్రి కాలి బూడిదయ్యాయి. కుటుంబ సభ్యులు ఇంట్లోని దేవుడి వద్ద దీపం పెట్టి బయటకు వెళ్లగా ఓ ఎలుక లోపలికి చొరబడు ఆ దీపాన్ని కింద పడేయడంతో అగ్నికీలలు వ్యాపించి ఇల్లంతా తగలబడిపోయింది. రైల్వే ఉద్యోగి అయిన ఆ ఇంటి పెద్ద ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ప్రభుత్వం నుంచి వచ్చిన సొమ్ము లక్ష రూపాయలు ఈ ఘటనలో కాలి బూడిదయ్యాయి. కొంత డబ్బుతో కొన్న రెండు తులాల బంగారం సైతం కరిగి ముద్దయింది. దుస్తులు, ఎలక్ట్రికల్ పరికరాలు, ఇంటి ధ్రువపత్రాలు, సర్టిఫికెట్లు పూర్తిగా కాలిపోయాయి. కట్టుకున్న బట్టలు తప్ప ఇంకేమీ మిగల్లేదు. గ్రామస్థులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. పాడేరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ అగ్నిప్రమాదంలో సుమారు 4 లక్షల రూపాయల ఆస్తినష్టం సంభవించింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇల్లు తగులబెట్టిన ఎలుక...రూ. 4 లక్షలు ఆస్తినష్టం..! - ఎలుకా ఎంత పనిచేశావ్
ఓ ఎలుక ఇల్లును తగులబెట్టిన విచిత్ర సంఘటన విశాఖ మన్యంలో చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన మూషికం దేవుడి చిత్రపటం వద్ద ఉన్న దీపం పడగొట్టడంతో... నిప్పు అంటుకుని ఇల్లు దగ్ధమైంది. దీంతో నాలుగు లక్షల ఆస్తి నష్టం సంభవించింది. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు.
ఇల్లు తగులబెట్టిన ఎలుక...4 లక్షలు ఆస్తినష్టం