విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (తెదేపా) రాజీనామా చేశారు. స్వయంగా రాసిన లేఖను శనివారం ఉదయం స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. అనంతరం విలేకర్లతో తన రాజీనామాకు కారణాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
‘నిరసన ప్రజా ఉద్యమంగా మారనున్న నేపథ్యంలో రాజకీయాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా పదవులు వదులుకొని అందరూ ముందుకొస్తే నిర్ణయం తీసుకునే వ్యక్తులపై ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారు. నా నిర్ణయానికి అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని ప్రశంసిస్తున్నారు. నా వెంట ఉంటామంటున్నారు.
ప్రజల గుండెచప్పుడు
విశాఖ ఉక్కు కర్మాగారంతో వేలమంది ఉద్యోగులకు, వివిధ వర్గాలకు చెందిన లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా విడదీయలేని బంధం ఉంది. దీన్ని తెలుగు ప్రజల గుండెచప్పుడుగా భావిస్తున్నారు. అలాంటి కర్మాగారాన్ని నష్టాల పేరుతో ప్రైవేటీకరించడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. మనిషి శరీరం నుంచి తలను వేరుచేసిన భావన కలుగుతోంది. సంస్థకు నష్టం వస్తే తీవ్రంగా దృష్టిపెట్టి దాన్ని పరిష్కరించాలి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ప్రధాని వాజపేయీని కలిసి పరిశ్రమ ప్రాధాన్యం వివరించడంతో రూ.1000 కోట్లు సాయం చేశారు. ఉక్కు కర్మాగారానికి సొంత గనులు లేకపోవడమే నష్టాలకు కారణం. గనులు కేటాయిస్తే టన్నుకు రూ.5 వేల భారం తగ్గుతుంది. అలాంటి చర్యలు తీసుకోవాలి తప్ప ప్రైవేటీకరణ సరికాదు. విశాఖలోనే పెరిగి, ఇక్కడే ఎదిగిన వ్యక్తిగా నాపై బాధ్యత ఉందని భావించాను. నాడు ఎందరో ప్రాణత్యాగం చేసి సాధించుకున్న ఉక్కు కర్మాగారాన్ని... ఇప్పుడు పదవులను త్యాగం చేసైనా కాపాడుకోవాలి.