FIRE ACCIDENT: విశాఖ జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలోని హెటెరో ఫార్మా పరిశ్రమలో రియాక్టర్లు పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని పరిశ్రమ యజామాన్యం.. విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
FIRE ACCIDENT: నక్కపల్లి హెటెరో ఫార్మా కంపెనీలో పేలుడు.. ఒకరు మృతి
20:29 February 23
మరొకరి పరిస్థితి విషమం
హెటెరో మందుల పరిశ్రమలో బుధవారం రాత్రి సంభవించిన పేలుడుతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పరిశ్రమలోని పీఎంఎస్‌వో సాల్వెంట్ తయారీ యూనిట్ వద్ద రాత్రి 7.30 గంటల సమయంలో రియాక్టర్ నుంచి పేలుడు సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఇక్కడ పని చేస్తున్న సాయిరాం.. గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంకా ఈ ప్రమాదంలో గంగాధర్, గోపాల్, రాజు, రాజేష్‌లకు గాయాలయ్యాయి. వీరిని విశాఖ తరలించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
పేలుడు విషయం తెలిసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదంలో స్థానికులు ఎవరైనా గాయపడ్డారా, మరణించారా అనే సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎమ్మెల్యే బాబూరావు, ఆర్డీవో గోవిందరావు, నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, గాయపడిన వారి వివరాలు తెలుసుకున్నారు. సీపీఎం జిల్లా నాయకులు లోకనాథం, అప్పలరాజు పరిశ్రమ వద్దకు చేరుకుని పరిశ్రమ నిర్వహిస్తున్న తీరును ఖండించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
పదేళ్ల కిందట జరిగిన భారీ పేలుడులో పలువురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లో ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తర్వాత తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన ప్రమాదంపై ఉద్యోగుల సైతం భయాందోళనకు గురయ్యారు.
ఇదీ చదవండి: