ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గోదావరిలో గల్లంతు

భద్రాద్రి రామయ్యనూ దర్శించుకునేందుకు కుటుంబసమేతంగా వెళ్లిన వారిని ఊహించని ప్రమాదం కాటేసింది. గోదావరి ప్రవాహానికి బోల్తాపడిన బోటు వారి జాడను గల్లంతు చేసింది. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 12 మందిలో 11 మంది గల్లంతయ్యారు.

మిస్సింగ్

By

Published : Sep 16, 2019, 4:43 AM IST

ఒకే కుటుంబానికి చెందిన 11 మంది గోదావరిలో గల్లంతు

గోదావరి బోటు ప్రమాదం విశాఖకు చెందిన ఓ కుటుంబంతో పాటు వారి బంధువుల్లో పెను విషాదాన్ని నింపింది. ముక్కుపచ్చలారని అయిదుగురు చిన్నారులతో సహా 11 మంది గల్లంతు అయ్యారు. మొత్తం 12 మంది భద్రాచలం వెళ్లేందుకు విశాఖ నుంచి బయలుదేరి వెళ్లగా ఒకరు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన వారంతా బంధువులు కావడం విషాదాన్ని మరింత పెంచింది.

విశాఖ మహారాణిపేటలోని రామలక్ష్మీ నగర్ కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబం సహా వారి బంధువులు 11 మంది గల్లంతైన వారిలో ఉన్నారు. కారు డ్రైవర్​గా పని చేస్తున్న రమణబాబుతో పాటు ఆయన భార్య అరుణకుమారి, ఇద్దరు పిల్లలు అఖిలేష్, కుషాలి విహారయాత్రకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. మధుపాడ రమణ బాబు సొంతూరు అనకాపల్లి మండలం చెనుల అగ్రహారం కాగా బతుకు తెరువు కోసం భార్య పిల్లలతో కలిసి విశాఖపట్నంలో ఉంటున్నట్లు తెలిసింది.

భార్య, కుమారుడితో రమణబాబు(పాతచిత్రం)

12 మందిలో ఒకరు సురక్షితం

కారు డ్రైవింగ్ చేసుకుంటూ జీవిస్తున్న రమణబాబు,కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం విశాఖ నుంచి రాజమహేంద్రవరం వెళ్లారు. రమణబాబు(35), ఆయన భార్య అరుణకుమారి(27), వారి పిల్లలు అఖిలేశ్(7), కుషాలి(5), అత్త భోశాల లక్ష్మి, ఆమె మనవరాలు సుశీల(3), రమణబాబు చిన్నత్త పెద్దిరెడ్డి దాలెమ్మ(45), రమణబాబు పెద్దక్క తలారి అప్పల నరసమ్మ(50), ఆమె కుమారుడి పిల్లలు గీతా వైష్ణవి(4), అనన్య(2), రమణబాబు చిన్నక్క బొండా లక్ష్మి(40), ఆమె కుమార్తె పుష్ప(13), గోపాలపురానికి చెందిన బోశాల పూర్ణ(22)లు విశాఖ నుంచి రాజమహేంద్రవరం వెళ్లిన వారిలో ఉన్నారు. వారిలో బోశాల పూర్ణ మినహా మిగిలిన 12 మంది ఒక కుటుంబానికి చెందిన వారే. చిన్నక్క వేపగుంటలో నివసిస్తుండగా.. పెద్దక్క ఆమె మనవరాళ్లు అరిలోవలోని దుర్గాబజార్​లో ఉంటున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారందరూ రైల్వే స్టేషన్ వెళ్లడానికి అనువుగా ఉంటుందని రాత్రి రమణబాబు ఇంటికి వచ్చారు. రాజమహేంద్రవరంలో దిగి భద్రాచలం వెళ్లడానికి పడవ ఎక్కారు. అనంతరం జరిగిన ప్రమాదంలో రమణబాబు అత్త బోశాల లక్ష్మిని సిబ్బంది రక్షించారు. మిగిలిన 11 మంది గల్లంతయ్యారు.

కమాండ్ కంట్రోల్ రూమ్

విశాఖ జిల్లాకు చెందిన గల్లంతయిన వారి ఆచూకీ కోసం తూర్పుగోదావరి అధికారులతో విశాఖ యంత్రాంగం సంప్రదింపులు చేస్తోంది. విశాఖ కలెక్టరేట్లో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. డీఆర్వో శ్రీదేవి నేతృత్వంలో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకొని బంధువులకు ఇస్తున్నారు.ప్రమాదం నుంచి బయట పడిన లక్ష్మీని కలుసుకోవడానికి మిగతా వారి ఆచూకీ తెలుసుకునేందుకు వీలుగా బాధితుల బంధువులను అధికారులు దేవీపట్నానికి తీసుకెళ్లారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details