విశాఖ మన్యం పాడేరులో కరోనా కేసులు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ప్రస్తుతం 190 కేసుల వరకూ కొవిడ్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. అసలే వర్షాకాలం…సీజనల్ వ్యాధులు ఓ పక్క భయం కలిగిస్తుంటే..మరో వైపు కరోనా విరుచుకుపడుతోంది. మన్యంలో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా విశాఖ కెజిహెచే ఆధారం.
మన్యంలో చాప కింద నీరులా విస్తరిస్తోన్న కరోనా
విశాఖ మన్యంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాడేరులో ఒకే వీధికి చెందిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కరోనాతో మృతి చెందారు. రోజురోజుకీ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.
పాడేరు ఐటీడీఏ వెనక ఉన్న రేకులు కాలనీ వీధిలో రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఉద్యోగులు కరోనాతో మృతి చెందారు. ఒకరు ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. మరొకరు ప్రభుత్వ అటవీ శాఖ ఉద్యోగి. వీరు ఆస్పత్రికి వెళ్లిన గంటల వ్యవధిలోనే మృత్యువాత పడ్డారు. కరోనా నిర్ధరణ కిట్లు లేకపోవడం, గిరిజన ప్రాంతం కావడం వల్ల వైద్యసేవలకు దూరంగా ఉండటంతో కరోనా వ్యాపిస్తే నియంత్రించడం కష్టమే. అధికారుల సేవలు ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. కరోనా వ్యాపించిన ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్లు ప్రకటించలేదు. తూతూమంత్రంగా బారికేడ్లు ఏర్పాటు చేసినా వాటిని పక్కకు నెెట్టి ప్రజలు యథేచ్ఛగా తిరుగుతున్నారు. సంజీవని బస్ పాడేరు మన్యంలో వచ్చింది కానీ ఇంతవరకూ దాని సేవలు ప్రారంభించలేదు. మన్యంలో ఎప్పటికప్పుడు కొవిడ్ వివరాలు చెప్పడానికి సైతం అధికారులు ముందుకు రావడం లేదు. ఉద్యోగులు మరణించిన రెండు రోజుల తర్వాత వెల్లడించడమే ఇందుకు నిదర్శనం. పాడేరు, హుకుంపేట, పెదబయలు, ముంచింగిపుట్టు, చింతపల్లిలో వ్యాపారులు స్వచ్ఛందంగా మధ్యాహ్నం వరకు దుకాణాలు మూసి వేస్తున్నారు.
ఇప్పటికైనా మన్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి మలేరియా, డయేరియా వైరల్ జ్వరాలతో పాటుగా కరోనా కట్టడికి తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇవీ చదవండి: ‘హోమ్ ఐసొలేషన్’ బాధితులకు అందని ఔషధాలు