ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చాలా మంది కూలి పనుల కోసం విశాఖకు వచ్చి నివసిస్తుంటారు. కరోనా మొదటి దశలో ఇళ్లకు వెళ్లిపోయిన వారంతా.. వైరస్ ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టాక.. మళ్లీ తిరిగివచ్చారు. కొవిడ్ తొలి దెబ్బ నుంచి కోలుకోకముందే.. రెండో దశ కార్మికలోకాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఓవైపు పనులు లేక.. మరోవైపు ఇళ్ల అద్దెలు కట్టలేక పూట గడవటం వీరికి కష్టంగా మారింది. వీటితోపాటు నిత్యావసర ధరలు పెరగడంతో వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.
విశాఖలో లక్షకు పైగా అసంఘటిత రంగ కార్మికులున్నారు. దినసరి భవన నిర్మాణ కార్మికులు పాతిక వేలకు పైగానే ఉన్నారు. గాజువాకతో పాటు విశాఖలోని ఇసుక తోట సమీపం.. కూలీలకు ప్రధానమైన ప్రాంతం. మేస్త్రీలు.. కూలీలను ఇక్కడ నుంచే నిర్మాణ ప్రాంతానికి తీసుకుని వెళ్తుంటారు. రోజూ పని దొరుకుతుందని ఆశతో వచ్చిన వారికి నిరాశే ఎదురవుతోంది. ఒకవేళ పని దొరికినా.. అరకొర కూలీ ఇచ్చి మేస్త్రీలు సరిపెడుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వమే ఆదుకోవాలని కూలీలు వేడుకుంటున్నారు.