విశాఖ పాడేరు ఏజెన్సీ... కాఫీ పంటకు ప్రధాన కేంద్రం. మన్యంలోని తోరణం రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నేరుగా ఫ్యాక్టరీలకు కాఫీ అమ్మకాలు సాగిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు ఏజెన్సీ నుంచి 18 టన్నుల కాఫీ పిక్కల అమ్మకాలు జరిగాయి. అక్కడ కాఫీ పంట నుంచి తయారైన పొడికి మంచి పేరు వస్తున్న కారణంగా.. సంస్థ యాజమాన్యం.. రైతులను కలిసేందుకు మన్యానికి వెళ్లింది. రైతులు మరింత దిగుబడి సాధించాలని ఆకాంక్షించింది.
బెంగళూరుకు చెందిన సుబ్బు బేవరేజ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ డైరెక్టర్ సుబ్బరాజు, వారి బృందం మన్యంలోని కాఫీ రైతులతో సమావేశమయ్యారు. వంతాడపల్లి, గొందూరు, జి.మాడుగుల మండలం నిట్టపుట్టులలోని రైతులతో వారు మాట్లాడారు. కాఫీ పంటలో మంచి దిగుబడి పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. తమతో నేరుగా పంట అమ్మకాల వల్ల కలిగే లాభాల గురించి తెలిపారు. మన్యం ప్రాంతంలోని కాఫీ గింజల నుంచి తయారయ్యే కాఫీ పొడి దేశవిదేశాలకు ఎగుమతి అవుతుందన్నారు.