ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడున్నరేళ్లైనా ఆ ఊసే లేదు.. ఒక్క పోస్టూ భర్తీ కాలేదు - ఏపీలో డీఎస్సీ పోస్ట్​ల ఖాళీలు

Cm Jagan is Comments on DSC: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామంటూ ప్రతిపక్షంలో ఉండగా ఊదరగొట్టిన జగన్‌.. మూడున్నర ఏళ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పటివరకూ ఒక్క పోస్టూ భర్తీ కాలేదు. పోనీ ఇకనైనా పోస్టులు తీస్తారా అంటే లేదని చెప్పాలి. ఎందుకంటే హేతుబద్ధీకరణ, తరగతుల విలీనం పేరిట ఇప్పుడు ఉపాధ్యాయ ఖాళీల సర్దుబాటు చేస్తున్నారు. దీంతో టీచర్ల కొలువుపై ఎంతోమంది ఆశలు గల్లంతైనట్టేనని.. జగన్‌ హామీల వలలో చిక్కుకొని నిండా మినిగిపోయారని ఉపాధ్యాయ, సామాజిక సంఘాల నాయకులు అంటున్నారు.

DSC
డీఎస్సీ

By

Published : Jan 1, 2023, 7:01 AM IST

Updated : Jan 1, 2023, 8:48 AM IST

Cm Jagan is Comments on DSC: అక్షరాల డీఎస్సీకి సంబందించి టీచర్​కు సంబందించి 23వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లెక్చర్​ చెప్పి..మరో వైపు గవర్నమెంట్ స్కూల్​లు అన్నీ కూడా బలపరచాలని ఆలోచన చేయాలి..స్కూల్​లలో ఖాళాగా ఉన్న టీచర్​ పోస్ట్​లు నింపాలని చూడాలి..మన పిల్లలకు బాగా చదువులు చెప్పాలని చూడాలి.. అలాంటి ఈ పెద్ద మనిషి చంద్రబాబు 23వేల టీచర్​ పోస్ట్​లు, డీఎస్సీ పోస్ట్​లు ఖాళీగా ఉంటే.. ఈయన ఇచ్చే నోటిఫికేషన్​ ఎంత కేవలం 7వేల 900 పోస్ట్​లకు ఇస్తాడు..ఆ ప్రతి పిల్లవాడికి నేను ఇవాల చెబుతావున్నా.. రేపు పొద్దున దేవుడు దయవల్ల మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మెగా డీఎస్సీ ఇవ్వాలని ప్రతీ పిల్లవాడికి చెబుతున్నా..ప్రతిపక్షగా ఉన్నప్పడు జగన్​

చూశారుగా.. నిరుద్యోగుల గోడు విన్నాను.. మీకు నేను ఉన్నాను..మెగా డీఎస్సీ వేస్తానంటూ ప్రతిపక్ష నేతగా ప్రతి సభలోనూ సీఎం జగన్‌ హామీలు గుప్పించారు. అధికారంలో వచ్చాక మూడున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ వేయలేదు సరికదా.. ఉన్న పోస్టులనే రద్దు చేశారు. ప్రభుత్వ బడుల్లో 23వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రతిపక్షనేతగా ఎన్నికల సభల్లో ప్రకటించిన సీఎం జగన్‌ ఇప్పుడు మాత్రం నోరు మెదపడం లేదు. కొత్తగా డీఎస్సీ వేయకపోగా పోస్టుల హేతుబద్ధీకరణ పేరుతో ఉన్నవాటినే మిగులుగా తేల్చేసి... సర్దుబాటు చేసేస్తున్నారు. డీఎస్సీ వస్తుందనే ఆశతో చూసిన నిరుద్యోగులకు మాత్రం ఎదురుచూపులే మిగిలాయి. ఎన్నికల ముందు నాటి ఖాళీలతోపాటు పదవీ విరమణలు, కొవిడ్‌ సమయంలో మరణాలతో వాటి సంఖ్య ఇంకా పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 50 వేల 677 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాజ్యసభలో కేంద్రమంత్రే చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 2లక్షల వరకు విద్యార్థులూ పెరిగారు. ఇలాంటప్పుడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అవసరం ఎందుకు లేకుండా పోయింది? డీఎస్సీ వస్తుందనే ఆశతో నిరుద్యోగులు మొదట్లో కోచింగ్‌ తీసుకున్నారు. ఇందుకు వేల రూపాయలు ఖర్చు చేశారు. ప్రభుత్వ చర్యలతో కొందరు చేసేదిలేక ప్రైవేటు ఉద్యోగాలకు వెళ్లిపోయారు.

మూడున్నరేళ్లైనా ఆ ఊసే లేదు.. ఒక్క పోస్టూ భర్తీ కాలేదు

గత బదిలీల సమయంలో 15వేల ఉపాధ్యాయ పోస్టులను బ్లాక్‌ చేశారు. ఈ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. 3 నుంచి 10 తరగతులు ఉన్న బడుల్లో 6 వేల 578మంది, 6 నుంచి 10 తరగతులకు 13 వందల 50మంది సబ్జెక్టు ఉపాధ్యాయులు అవసరం కానున్నట్లు అధికారులు లెక్క తేల్చారు. వీటన్నింటినీ సర్దుబాటుతో భర్తీ చేసేశారు. 1 నుంచి 8 తరగతులకు ఒకే మాధ్యమం చేయడం, 9,10 తరగతుల్లో 60మందికో సెక్షన్‌ చేయడంతోపాటు 3,4,5 తరగతుల విలీనం, హేతుబద్ధీకరణతో మిగిలిన ఎస్జీటీలను సర్దుబాటు చేశారు. ఆ తర్వాత సైతం మిగిలిన ఎస్జీటీ పోస్టులను విద్యార్థుల సంఖ్య ఆధారంగా బడులకు ఇస్తున్నారు. ఈసారి ఉపాధ్యాయ బదిలీల్లోనూ కొన్ని పోస్టులు బ్లాక్‌ చేస్తామని విద్యాశాఖ ప్రకటించింది. అవన్నీ ఖాళీలే.

నూతన జాతీయ విద్యా విధానంలో ఆర్ట్, క్రాఫ్ట్‌ పోస్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వం మాత్రం వీటిని రద్దు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 692 మండల విద్యాధికారుల పోస్టుల ఏర్పాటు కోసం 11 వందల 45 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్‌ ఉపాధ్యాయ పోస్టులను రద్దు చేసింది. అయిదు అదనపు డైరెక్టర్ల పోస్టులను సృష్టించేందుకు 2021 అక్టోబరులో మరో 15 ఆర్ట్, క్రాఫ్ట్, డ్రాయింగ్‌ ఉపాధ్యాయ పోస్టులకు ఎగనామం పెట్టింది. ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తున్న 3 వేల 260 పోస్టులకు సర్వీసు నిబంధనల కోసం 4 వేల 764 ఎస్జీటీ పోస్టులను రద్దు చేసింది. కర్నూలు జిల్లా మినహా ఉమ్మడి 12 జిల్లాల్లో 397 చొప్పున పోస్టులను విలీనం చేసింది.

ఉపాధ్యాయ పోస్టులను తగ్గించుకొని, ఆర్థిక భారాన్ని దించుకునేందుకే ప్రభుత్వం సర్దుబాటుకు తెరతీసింది. పోస్టుల హేతుబద్ధీకరణకు ఉత్తర్వు 117ను తీసుకొచ్చింది. దీన్ని ఏటా అమలు చేస్తూ వెళ్తే భవిష్యత్తులోనూ కొత్త డీఎస్సీ వచ్చే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ పాఠశాలల్లో 9,10 తరగతుల్లోనే తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉన్నాయి. మిగతా అన్ని తరగతుల్లోకూ ఒకే మాధ్యమాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో 1 నుంచి 8 తరగతులకు ఇప్పటి వరకు రెండు మాధ్యమాల్లో బోధిస్తున్న వారిలో ఒక మాధ్యమం పోస్టులు రద్దయ్యాయి. 9,10 తరగతుల్లో 60మంది విద్యార్థులకు ఒక సెక్షన్‌ను ఏర్పాటు చేయాలనే నిబంధన విధించారు. 3-10తరగతులు ఉండే హైస్కూల్‌లో 137మందికిపైగా విద్యార్థులు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టును ఇచ్చారు. దీంతో చాలా బడులకు ఈ రెండు పోస్టులు పోయాయి. 6-10తరగతులు ఉన్న పాఠశాలలో 92మందికిపైగా పిల్లలు ఉంటేనే ప్రధానోపాధ్యాయుడు, పీఈటీ పోస్టు ఇచ్చారు.

3 నుంచి 8 తరగతులు ఉన్న బడుల్లో 98 మందిలోపు ఉంటే అక్కడ సబ్జెక్టు ఉపాధ్యాయులను తీసేశారు. 30మందికి ఒక్క సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ చొప్పున కేటాయించారు. మూడో తరగతి నుంచి సబ్జెక్టు ఉపాధ్యాయుడితో బోధిస్తామని చెప్పిన ప్రభుత్వం పిల్లలు తక్కువగా ఉన్నారని తన హామీని తానే మూలకు పెట్టేసింది. ఇలాంటి వాటికి ఎస్జీటీలను కేటాయించారు. బాలికల ఉన్నత పాఠశాలలో 275మందికిపైగా ఉంటేనే మ్యూజిక్, డ్రాయింగ్, కుట్టుమిషన్‌ ఇన్‌స్ట్రక్టర్లను ఇచ్చారు. ఈ లెక్కన మ్యూజిక్, డ్రాయింగ్‌ పోస్టులు తగ్గిపోయాయి.

నూతన విద్యా విధానమంటూ ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను కిలోమీటరు దూరంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,731 ప్రాథమిక బడుల నుంచి 3,4,5 తరగతులు తరలిపోయాయి. దీంతో 1,2 తరగతులే మిగిలి, విద్యార్థుల సంఖ్య పడిపోయింది. దాదాపు ఏడువేలకుపైగా బడుల్లో పిల్లల సంఖ్య 20కంటే తక్కువకు చేరడంతో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారిపోయాయి. వీటి భవిష్యత్తు ప్రమాదంలో పడింది. ఇక్కడ టీచర్‌ సెలవు పెడితే విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎస్జీటీ పోస్టులను మిగులుగా తేల్చి వీరిని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయులుగా సర్దుబాటు చేసేశారు. ప్రాథమిక బడుల్లో 121మంది కంటే తక్కువ పిల్లలు ఉన్నచోట ప్రధానోపాధ్యాయుడి పోస్టును రద్దు చేశారు. ఈ ప్రక్రియతో ఎస్జీటీ పోస్టుల్లో భారీగా మిగులు తేల్చారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 1, 2023, 8:48 AM IST

ABOUT THE AUTHOR

...view details