విశాఖ గ్యాస్ లీకేజీ వలన ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, మరో ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.స్టైరీన్ ఆవిర్ల ప్రభావంతో మనుషులతో పాటు జంతువులు, పాములు, ఎలుకలు, పిల్లులు, కుక్కలు.. ఇలా కొన్ని ఎక్కడ పడితే అక్కడ చనిపోయాయి. కన్నాలు, కాలువల్లోని ఎలుకలు, ఇళ్ల లోపల చిన్న జంతువులు విషవాయువు ప్రభావంతో చనిపోయి ఉండొచ్చని, వాటినుంచి వెలువడే బ్యాక్టీరియాతో ఇబ్బందులు రావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విషవాయువు లీకైందని గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసి పరుగులు పెట్టారు. ఆ రోజు నుంచి పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బంది రక్షణ చర్యలు ప్రారంభించారు.జంతువులు, క్రిమి కీటకాలు విషవాయువు పీల్చి చనిపోవడంతో వాటినుంచి ఎలాంటి బ్యాక్టీరియాలు వస్తాయనేది సందేహంగా ఉంది. వాటి ప్రభావం ఎన్ని రోజులకు, ఎలా ఉంటుందో తెలియాలి. వాటిని పరీక్షించి సరైన మార్గదర్శకాలు వస్తే గానీ స్పష్టత రాదు’ అని పర్యావరణ పర్యావరణ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మరోవైపు కనిపించినంత వరకు కళేబరాల్ని పశుసంవర్ధక శాఖ సేకరించింది. 34 పశువులు, జంతువులు మృతి చెందాయి. మరో రెండు తీవ్ర అనారోగ్యంతో ఉన్నాయి. 191 ప్రాణులకు వైద్యం అందిస్తున్నారు. మరణించిన వాటి నమూనాలను చెన్నైలోని ‘ఫార్మకో విజిలెన్స్ ల్యాబ్ ఫర్ యానిమల్ ఫీడ్ ఫుడ్ సేఫ్టీ’కి పంపారు. వారు పరీక్షించి ఎలాంటి ప్రమాదం ఉందో వివరిస్తూ నివేదికలు ఇవ్వనున్నారు. నిపుణుల సూచన మేరకు మరిన్ని చర్యలు చేపట్టే అవకాశం ఉంది. కానీ.. ఇళ్లలో ఉన్నవి, పైపులు, కాలువల్లో ఉండిపోయిన వాటిని ఇంకా గుర్తించలేదు. ఇలాంటి భయాలన్నీ పోతేనే ఆ ప్రాంతమంతా ‘జీవ పరిశుభ్రత’ ఉన్నట్లనీ, లేకపోతే అప్రమత్తం కావాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీటితోనూ సమస్యే..
ప్రస్తుతం గ్రామాల్లో విష ప్రభావం లేకుండా నీటిని జల్లుతున్నారు. కానీ, విషవాయు అవశేషాలతో కలిసి వెళ్లే నీరు ఎక్కడ కలుస్తుందన్నదీ ముఖ్యమే. ప్లాంటు లోపల ట్యాంకులను చల్లబరిచేందుకు నీటిని విపరీతంగా వినియోగిస్తున్నారు. ఇలా విషంతో కలిసిన వ్యర్థ నీటిని కచ్చితంగా శుద్ధి చేయాలని చెబుతున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వటం లేదు.