ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ అంగన్​వాడీ కార్యకర్తల ఆందోళనలు...

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా సంక్షేమ పథకాలకు దూరం చేశారంటూ.. వివిధ జిల్లాల్లో అంగన్​వాడీ కార్యకర్తలు నిరసనకు దిగారు. అమ్మఒడి, ఇళ్ల స్థలాలు, భీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలతో పాటు బిల్లులు, అంగన్​వాడీ కేంద్రాల అద్దెలు వెంటనే చెల్లించాలని ధర్నాలు చేపట్టారు.

anganwadi workers protests
వివిధ జిల్లాల్లో అంగన్​వాడీ కార్యకర్తల నిరసనలు

By

Published : Jan 27, 2021, 4:35 PM IST

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతూ.. అంగన్​వాడీ కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. సంక్షేమ పథకాలకు తమను దూరం చేశారంటూ.. వివిధ జిల్లాల్లో ధర్నాకు దిగారు.

విశాఖలో...

విశాఖలో అంగన్​వాడీ కార్యకర్తల నిరసనలు

ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకూ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ అంగన్​వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విశాఖలో ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం చాలీచాలని జీతాలు చెల్లిస్తూ.. సంక్షేమ పథకాలకు దూరం చేసిందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించకుండా వివిధ పథకాలకు అనర్హులను చేయడం సమంజసం కాదని ఆరోపించారు. పెండింగ్ బిల్లులు, అంగన్​వాడీ కేంద్రాల అద్దెలు వెంటనే చెల్లించాలని కోరుతూ.. సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కర్నూలులో...

కర్నూలులో అంగన్​వాడీ కార్యకర్తల నిరసనలు

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ.. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్​వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అంగన్​వాడీలకు సంబంధించిన బకాయిలను చెల్లించాలని.. అమ్మ ఒడి, ఇళ్ల స్థలాలు, భీమా సౌకర్యాలను వర్తింపజేయాలని కోరారు. సర్వీసులో ఉండి చనిపోయిన కార్యకర్తల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.

అనంతపురంలో...

అనంతపురంలో అంగన్​వాడీ కార్యకర్తల నిరసనలు

అంగన్​వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతూ.. సీఐటీయూ ఆధ్వర్యంలో వారు ధర్నా చేపట్టారు. అనంతపురంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద బైఠాయించి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినా.. ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాశ్వత ఉద్యోగులుగా గుర్తించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు కోరుతూ హైకోర్టులో పిటిషన్‌

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details