Tirumala Ghat Road: తిరుమల కనుమ రహదారుల్లోని వరుస రోడ్డు ప్రమాదాలు.. శ్రీవారి భక్తులకు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన వారం రోజుల్లో నాలుగు రోడ్డు ప్రమాదాలు సంభవించగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ప్రైవేటు వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడం పట్ల భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు.. తిరుమల కనుమ రహదారులపై అవగాహన లేకపోవడం ప్రమాదాలకు కారణంగా భావిస్తున్నారు. తిరుమలకు వెళ్లే రెండో కనుమ దారితో పోలిస్తే తిరుపతి వచ్చే మొదటి కనుమదారిలోనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. మొదటి కనుమ దారిలోని 58 మలుపుల్లో 35వ మలుపు నుంచి ఆరో మలుపు వరకు ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంది.
Bus Overturned In Tirumala: తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు బోల్తా.. ఆరుగురికి తీవ్ర గాయాలు
కనుమ రహదారుల్లో వాహనాల వేగ నియంత్రణకు గతంలో తితిదే ప్రత్యేక చర్యలు అమలు చేసేది. అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి తిరుమల వెళ్లడానికి 28 నిముషాలు, తిరుమల నుంచి అలిపిరి రావడానికి 40 నిముషాల సమయాన్ని తితిదే నిర్దేశించింది. అలిపిరి వద్ద తితిదే విజిలెన్స్ అధికారులు వాహనాల రసీదును స్కాన్ చేసి ప్రయాణ సమయాన్ని ధ్రువీకరించేవారు.
ముందుగా గమ్యస్థానానికి చేరిన వాహనాలకు మొదటిసారి జరిమానా విధించేవారు. పదేపదే నిబంధనలు అతిక్రమించే వాహనాలను కనుమ రహదారిలో నిషేధించేవారు. ఇప్పుడా నియంత్రణ కొరవడంతో వాహన చోదకులు వేగంగా వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
TTD focus on Accidents: ప్రమాదాల నివారణకు తితిదే చర్యలు.. మూడు ప్రత్యేక బృందాల ఏర్పాటు
నెమ్మదిగా వెళ్లాల్సిన మలుపుల్లో అవగాహన లోపంతో వేగంగా వెళ్లడం ప్రమాదాలకు కారణమవుతోంది. ఇటీవల వరస ప్రమాదాలు చోటు చేసుకోవడంతో నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టారు. వరస ప్రమాదాల నేపథ్యంలో రవాణాశాఖ, తితిదే నిఘా విభాగం, పోలీసులు కూడిన ప్రత్యేక బృందాలతో నియంత్రణ చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.
కనుమ రహదారుల్లో ప్రయాణంపై వాహన చోదకులకు అవగాహన కల్పించడంతో పాటు వేగ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే కనుమ రహదారుల్లో ప్రమాదాల్ని నిలువరించవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
"తిరుమలో ఘాట్ రోడ్లలో.. ప్రమాదాలు నివారణ చర్యల్లో భాగంగా.. వేగ నియంత్రణకు గతంలో అమల్లో ఉన్న వేగ పరిమితి సమయాన్ని పెడుతున్నాం. దీని పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి.. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నాం. అదే విధంగా అలిపిరి చెక్ పాయింట్ దగ్గర కొన్ని బృందాలు.. వాహనాలను చెక్ చేస్తాయి. ఏవైతే వాహనాలు ఫిట్నెస్ లేకుండా ఉన్నాయో వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం లేని వాహన చోదకులపై చర్యలు తీసుకుంటాం". - మునిరామయ్య, తిరుమల ఏఎస్పీ
తిరుమల ఘాట్ రోడ్డు మార్గంలో వరుస ప్రమాదాలు.. భయాందోళనలో భక్తులు