Secunderabad Fire Accident Two Dead Bodies Identified: ఉవ్వెత్తున మంటలతో సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని దక్కన్ స్పోర్ట్స్ నిట్‌వేర్ మాల్ అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించగా.. గుజరాత్‌కు చెందిన మరో ముగ్గురు కూలీలు జునైద్, వసీం, జహీర్ ఆచూకీ గల్లంతైంది. కూలీల సెల్‌ఫోన్ లోకేషన్ మంటలు చెలరేగిన భవనంలోనే చూపిస్తుండటంతో వారు సజీవ దహనమయ్యే అవకాశముందన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. దీంతో నిన్న ఉదయం నుంచి వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
22 అగ్నిమాపక శకటాలతో మంటలు పూర్తిగా ఆర్పివేసినప్పటికీ భవనంలో వేడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెస్క్యూ సిబ్బంది మాల్ లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో డ్రోన్ కెమెరాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. భవనం రెండో అంతస్తులో గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న రెండు మృతదేహాలను డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. భవనం లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ తెలిపారు. డ్రోన్ కెమెరా ద్వారా సమాచార సేకరణకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భవనం లోపల ఇంకా వేడిగానే ఉందని, ఇప్పటికీ భవనంలోనికి వెళ్లలేకపోతున్నామని ఆయన తెలిపారు.