Nara Lokesh Travel In RTC Bus: యువగళం పాదయాత్ర 20వ రోజు సత్యవేడు నియోజకవర్గంలో సాగింది. పాదయాత్రలో భాగంగా పిచ్చాటూరులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆర్టీసి బస్సు ఎక్కారు. టీడీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ ఛార్జీలు.. వైసీపీ పాలనలో ఆర్టీసి ఛార్జీల మధ్య వ్యత్యాసాన్ని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఛార్జీలు విపరీతంగా పెంచారని ప్రయాణికులు వివరించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేసిన తరువాత సిబ్బంది పడుతున్న ఇబ్బందులు గురించి కండక్టర్ని లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి వారు ప్రయాణించే ఆర్టీసి ఛార్జీలను మూడు సార్లు పెంచిందని లోకేశ్ ఆరోపించారు. జగన్ బాదుడే బాదుడుకి ప్రజలపై విపరీతమైన భారం పెరిగిందని విమర్శించారు. పెంచిన ఆర్టీసి ఛార్జీలు తగ్గించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్టీసీ కార్మికుల జీవితాలు మారిపోతాయని.. విలీనం చేసి గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. వెంకటరెడ్డి కండ్రిగలో మహిళలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. వైసీపీ పాలనలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను లోకేశ్‌కు వివరించారు. వారి తరపున పోరాడుతున్నానని.. అందుకే ప్రభుత్వం తన గొంతు నొక్కుతోందని లోకేశ్ వెల్లడించారు. కనీసం మీ కష్టాలు తెలుసుకునేందుకు కూడా మైకు ఇవ్వడం లేదని లోకేశ్ ఆరోపించారు. సమస్యలపై పోరాడుతున్న మహిళలపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే మహిళల సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వాలు ఎప్పటికీ శాశ్వతం కాదని.. ప్రజలే శాశ్వతమని లోకేశ్ గుర్తు చేశారు.