CPI NARAYANA FIRES ON CM JAGAN : సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు చివరి దశకు రావడం వల్ల.. ఆ భయంతోనే ముఖ్యమంత్రి జగన్ దిల్లీకి వెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. వివేకా హత్య కేసు చివరి దశకు వచ్చిన తర్వాత కొత్త కమిటీని వేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ, బీజేపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీతో చేసుకున్న ఒప్పందం వల్ల వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు ఆలస్యం కాబోతుందని ఆయన ఆరోపించారు. కేంద్ర హెం మంత్రి అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. జగన్ సంపాదించిన అక్రమ ఆస్తుల మొత్తాన్ని కర్ణాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నాడన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి జగన్‌ని అమిత్ షా పావులా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలను తాను ఎక్కడా చూడలేదన్నారు.
ఏప్రిల్ 14 నుంచి దేశవ్యాప్తంగా పాదయాత్రలు: రాష్ట్రాన్ని జగన్ స్మశానంలా మార్చాడాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 14న రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మే 15 వరకు "దేశ్ కా బచావో.. మోదీ హఠావో" పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టబోతున్నట్లు వివరించారు. ఓ వైపు మోదీ దుర్మార్గ చర్యలను ఎండగడుతూనే.. మరోవైపు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం విశదీకరిస్తూ పొలిటికల్ ఫైట్‌కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. అటు వైసీపీ.. ఇటు బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమైనట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తూ.. వారికి చైతన్యం కలిగించే దిశగా తమ అడుగులు సాగనున్నట్లు ఆయన తెలిపారు.