TDP CHEIF NARA CHANDARBAU NAIDU COMMENTS: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఊరూవాడాలో 'భోగి' మంటలు మొదలయ్యాయి. ప్రజలు పట్టణాల నుంచి సొంతూళ్లకు చేరుకోవడంతో అన్ని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి జిల్లాలోని నారావారిపల్లెకు చేరుకుని సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.1 కాపీలను భోగి మంటల్లో వేసి చంద్రబాబు నాయుడు, టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ భోగి-సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. పనికిరాని వస్తువులన్నింటితో పాటు జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.1 కాపీలను 'భోగి' మంటల్లో వేసి నిరసన తెలిపామన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. తెలుగు జాతికి నందమూరి తారక రామారావు ఒక వరమని పేర్కొన్నారు. భారతదేశానికి గొప్ప సంపద యువతేనని, జన్మభూమికి అందరూ తరలివస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం. సాంకేతికతతో ప్రపంచం ఓ గ్రామంగా మారింది. జీ-20 సన్నాహక సదస్సులో ప్రధానితో సమావేశమయ్యా. 2047 విజన్‌పై ప్రధాని మోదీకి వివరించా. ఐటీలో ప్రపంచమంతా మన తెలుగువాళ్లే ఉన్నారు. ప్రజావేదిక విధ్వంసంతో జగన్ పాలన మొదలుపెట్టారు. ప్రజలపై పన్నులు, ఛార్జీల మోత మోగిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది టీడీపీనే. కొంతమంది ఈరోజు కోసం బ్రతుకుతారు. మరికొంతమంది రేపటి కోసం బ్రతుకుతారు. కానీ, నేను మాత్రం భవిష్యత్తు కోసం బ్రతుకుతాను.- నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత