BJP Satya Kumar comments on CM Jagan: కోడి కత్తి డ్రామా తరహాలో అవినాష్ రెడ్డి డ్రామా కొనసాగుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినాష్ రెడ్డి విచారణ విషయంలో సీబీఐకి రాష్ట్ర పోలీసులు సహకరించకపోవడం శోచనీయమన్నారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సత్యకుమార్ వెల్లడించారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమని ఆయన అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో ఓడినా.. ఓట్ల శాతం మాత్రం భాజపాకి పెరిగిందని సత్యకుమార్ తెలిపారు.
జగన్ రైతులను మోసం చేశారు: రాజధాని అంశంతో పాటు రైతు స్థిరీకరణ, పంటల బీమా, రైతు భరోసా, మద్దతు ధర, బిందు సేద్యంతో పాటుగా అనేక అంశాల్లో సీఎం జగన్ రైతులను మోసం చేశారని సత్యకుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో పొత్తుల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని వెల్లడించారు. పంచభూతాల్లో ఏ ఒక్కదాన్నీ వదలకుండా వైకాపా నేతలు దోచేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందని ఆరోపించారు. ఆ పార్టీ కార్యకర్తలు దోపిడీ దొంగలుగా మారారన్నారు. నాలుగు సంవత్సరాలలో అవినీతిని వ్యవస్థీకృతం చేసి ప్రజలు మాట్లాడకుండా చేయడమే జగన్ చేసిన అతి పెద్ద విజయమన్నారు.
'వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సహకరించడం లేదు. సీబీఐకి రాష్ట్ర పోలీసులు సహకరించకుండా వ్యవహరిస్తున్నారు. అవినాష్ అరెస్ట్ అవ్వడం మాత్రం ఖాయం. వైసీపీలో సంస్కారం లేని వ్యక్తులు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వం యువతకు మెగా డీఎస్సీ పేరుతో నమ్మకద్రోహం చేసింది. రాష్ట్రంలో రీసర్వే పేరుతో అటవీ భూములతో పాటుగా.. వివాదాస్పద, ప్రభుత్వ భూములను గుర్తించి ఆక్రమిస్తున్నారు. నెల్లూరులో బీజేపీ ఓబీసీ మోర్చా నాయకుడి మీద పోలీసులు ప్రవర్తించిన తీరు హేయమైనది.-' సత్యకుమార్, భాజపా జాతీయ కార్యదర్శి