ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను చాలావరకు ఇప్పటికే అమలు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ మంగళవారం లోక్‌సభకు వెల్లడించారు. ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో ఇంతవరకు ఎన్ని పూర్తిచేశారు, ఒకవేళ పూర్తి చేయకపోతే అందుకు కారణాలేంటి? హామీలన్నీ అమలు చేయడానికి ఉన్న గడువెంత? అని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
‘విభజన చట్టంలో చెప్పిన అంశాల్లో చాలావరకు ఇప్పటికే అమలుచేశాం. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. మౌలికరంగ ప్రాజెక్టులు, విద్యాసంస్థలు నెలకొల్పేందుకు చాలా సమయం ఉంది. చట్టంలో పదేళ్ల గడువు పొందుపరిచారు. చట్టంలోని వివిధ అంశాల అమలుపై కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో సమీక్షిస్తోంది. ఇప్పటివరకు 25 సార్లు సమావేశాలు నిర్వహించింది. ఇరురాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నాలు చేశాం’ అని మంత్రి తెలిపారు.