శ్రీకాకుళం జిల్లాలో పాఠశాలల పునఃప్రారంభం నాటి నుంచే అక్షయపాత్ర ద్వారా మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తొలివిడతలో శ్రీకాకుళం, ఆమదాలవలస, గార మండలాల్లోని పాఠశాలల్లో ఈ పథకం అమలు చేశారు. ఈ నెల 12 నుంచి అక్షయపాత్ర కేంద్రీకృత వంటగది ద్వారా విద్యార్థులకు ఆహారం అందించేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాచరణతో ముందడుగు వేసింది.
అక్షయ పాత్రతో ఒప్పందం.. రుచిగా మధ్యాహ్న భోజనం - mid day meals
మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి.. నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్‌తో ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతున్న తీరుపై కథనం.
అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా 3 మండలాల్లోని 307 పాఠశాలలకు ఆహారం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురంలో ఉన్న అక్షయపాత్ర ఫౌండేషన్ కేంద్రీకృత వంటగది నుంచి మధ్యాహ్న భోజనాన్ని 20 వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నారు. 23 వేల 530 మంది విద్యార్థులకు రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్ధులందరికీ... ఇక నుంచి అక్షయపాత్ర ద్వారానే ఆహారం అందిస్తారు. ఆహారం బాగుంటుందని చిన్నారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలల్లో విద్యార్థులకు వారానికి ఐదు కోడిగుడ్లు వండి పెట్టాలి. అయితే అక్షయపాత్ర నుంచి వచ్చిన భోజనం రోజువారీ మెనూలో కోడిగుడ్లు ఇవ్వరు. ప్రత్యామ్నాయంగా పాఠశాలలోనే మధ్యాహ్న భోజన వర్కర్లు గుడ్లు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక వాహనం ద్వారా పాఠశాలలకు ఆహార పదార్థాలను మధ్యాహ్న భోజన సమయానికి చేర్చేలా ఫౌండేషన్ ప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు.