Oldman Died due to Pension Cut: ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌పై అనేకమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. నెలనెలా వచ్చే పెన్షన్ కోసం వృద్ధులు, ఏ ఆధారం లేనివాళ్లు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అసలే అయినవాళ్లు లేక.. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుండే వాళ్లకు ఈ పింఛనే ఆధారం. కానీ ప్రభుత్వ నిబంధనలతో ఎంతోమంది పింఛన్లకు దూరమవుతున్నారు. ఇన్నాళ్లు ఇచ్చిన పెన్షన్లను నిలిపివేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగి.. అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేదు. వృద్ధాప్యంలో ఇక తిరిగే ఓపిక లేక ఎంతోమంది తనువు చాలిస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా శ్రీకాకుళం జిలాలో జరిగింది.
శ్రీకాకుళం జిల్లాలో ఓ వృద్ధునికి పింఛన్ అందక ఆకలితో అలమటిస్తూ తనువు చాలించాడు. పలు సాంకేతిక సమస్యలతో పింఛన్ ఆగిపోవటంతో.. వృద్ధునికి అందాల్సిన పింఛన్ అందలేదు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వహించారు. ఎవరూ లేని ఒంటరివాడని వివరించినా పట్టనట్లు వ్యవహరించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలం మామిడిగుడ్డి గ్రామానికి చెందిన సవర బారి ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. వెనకముందు ఎవరూ లేకపోవటంతో బంధువు కైలాష్ అప్పుడప్పుడు వచ్చి బాగోగులు చూసేవాడు.
సవర బారికి కనీసం ఉండటానికి సరైన ఇల్లు కూడా లెేదు. ఇతనికి ప్రభుత్వం నుంచే పింఛన్‌పై ఆధారపడి జీవించేవాడు. వచ్చిన కొద్ది మొత్తంతో జీవనాన్ని కొనసాగించాడు. గత కొంతకాలంగా ఇతనికి అందాల్సిన పింఛన్ ఆగిపోయింది. కనీసం తినటానికి తిండి దొరకని పరిస్థితి వచ్చింది. దీంతో స్థానికులు ఇతనికి ప్రతిరోజు భోజనం అందించేవారు. విషయం తెలుసుకున్న బంధువు కైలాష్ పలుమార్లు ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేశాడు.