శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలో బీసీలపై దాడులు, దళితులు భూముల ఆక్రమణ ఘటనలపై జాతీయ బీసీ కమిషన్ సభ్యులు టి.ఆచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహ ఘటనలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. బంటుపల్లిలో పర్యటించిన ఆయన.. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితులు విన్నవించారు. ఫొటోలు, పత్రాలు ద్వారా ఆయనకు వివరించారు.
వీటిపై ఆర్డీవో కిషోర్ కుమార్, డీఎస్పీ మహేంద్రలను.. ఆచారి వివరణ కోరారు. తమ ఆధీనంలో భూములను అధికార పార్టీకి చెందిన వారు ఆక్రమించుకున్నారని, ఈ విషయంపై రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని బంటుపల్లి గ్రామానికి చెందిన దళితులు.. ఆచారి దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్డీవోను ఆదేశించారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. బీసీలు, దళితులపై దాడులు, భూ ఆక్రమణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత నివేదికను కమిషన్కు పంపాలని చెప్పారు.