MINISTER DHARMANA VIRAL COMMENTS: వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తానో.. చేయనో తెలియదని.. దానికి ఇంకో సంవత్సరం సమయం ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళం PSNM పాఠశాలలో ఏర్పాటు చేసిన ఆసరా పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే కొందరు లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. మీ ఆత్మ విశ్వాసం పెంచేలా కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఆలోచించాలన్న ధర్మాన.. ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ‘మొన్న ఓ చోట జగనన్న ఆసరా పంపిణీ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తూ ఓ మహిళ.. ఆసరా డబ్బులు జగన్ ఇంట్లోంచి ఇచ్చేస్తున్నాడా అంటోంది. తిన్నది తిరగబోసుకోవడం అంటే ఇదే. సంస్కారం లేకపోతే ఎలా? ఏం మనుషులో ఏంటో.. పద్దుకు మాలిన వ్యక్తుల్లా మాట్లాడితే ఎలా’ అని ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన స్వయం శక్తి సంఘాల మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
నిత్యావసరాల ధరలు గురించి మాట్లాడుతూ.. ‘ఒకరు రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగిపోయాయని ప్రచారం చేస్తారు. ధరలు పెరగడానికి, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి సంబంధమేంటి? ధరలు దేశంలో అన్ని ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. జగన్‌కు ప్రజల్లో ఉన్న ప్రేమ, ఆదరణను తగ్గించేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారమిస్తే మోసం చేసిన విషయం మీకు తెలిసిందే. ఇచ్చిన హామీని అమలు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది’ అని మంత్రి పేర్కొన్నారు.