'కరోనా అనుమానంతో ఆసుపత్రికి వెళ్తే.. కాటికి పంపారు' కొవిడ్ అనుమానంతో ఆస్పత్రిలో చేర్పించిన తమ బిడ్డను శవంగా అప్పగించారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నిర్ధరణ పరీక్షలు చేయకుండానే ఐదు రోజుల పాటు కరోనా వార్డులో ఉంచారని ఆరోపించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.
తెలియకుండానే వేరే ఆసుపత్రికి తరలించారు...
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని పట్టుమహదేవి కోనేరుగట్టుకు చెందిన శివాజీ (28)కి జ్వరం రావడంతో తోపాటు, శ్వాస తీసుకోవడం కష్టమవడంతో 25వ తేదీన టెక్కలిలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం బెడ్ ఏర్పాటుచేసి వైద్యం అందిస్తామని సిబ్బంది తెలిపారు. అయితే అదేరోజు రాత్రి 11.30 గంటల సమయంలో అతడ్ని శ్రీకాకుళం లోని సర్వజన ఆసుపత్రికి తరలించారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రిఫర్ చేశారని, తమ కుమారుడు ఫోనుచేసి చెబితే గాని విషయం తెలియలేదని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. శ్రీకాకుళం ఆసుపత్రిలో సైతం సరిగా పట్టించుకోలేదని వాపోయారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో తాము చివరి సారిగా తమ కుమారుడితో ఫోనులో మాట్లాడామని, తనకు శ్వాస సరిగా అందడం లేదని, ఎవరూ సరిగా పట్టించుకోవడం లేదని వాపోయాడని చెప్పారు. ఫోన్‌చేసి బిడ్డ మృతిచెందాడని, మృతదేహాన్ని తీసుకెళ్లాలని తమకు సమాచారం ఇచ్చారని కన్నీరుమున్నీరయ్యారు. తమకు జరిగిన అన్యాయం మరికొకరికి జరగకుండా ప్రభుత్వం కఠినచర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:శ్రీకాకుళం జిల్లాలో కరోనా కల్లోలం: వరుస చితిలు