మంత్రి బొత్సను అడ్డుకున్నారు.. ఆత్మహత్య చేసుకుంటామన్నారు.. ఎందుకు? - Indy Trade Victims Stopped Minister Botha Convoy
తమకు న్యాయం జరగేలా చూడాలని మంత్రి బొత్సను ఇండీ ట్రేడ్ బాధితులు కోరారు. లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. మోసానికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.
అధిక వడ్డీకి ఆశపడి మోసపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఇండీ ట్రేడ్ బాధితులు వేడుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో మంత్రి బొత్స సత్యనారాయణ కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. సంతకవిటి మండలంలో ఇండీ ట్రేడ్ పేరుతో అధిక వడ్డీలు ఎర చూపి సుమారు 150 కోట్లు పైగా మోసం చేసిన వారికి ఇంత వరకూ శిక్ష పడలేదని మంత్రికి వివరించారు. రెండున్నర ఏళ్లు గడచినా కేసు విచారణలో పురోగతి కనిపించలేదని, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని మంత్రిని కోరారు. అప్పులు చేసి తీర్చలేని స్థితిలో ఉన్నామని, న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని మంత్రి బొత్స సత్యనారాయణ ముందు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారని బాధితులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి బొత్స... ఇండీ ట్రేడ్ సూత్రదారులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.