Roads Damaged in Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో పట్టణ, గ్రామాలు అని తేడా లేకుండా రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చిన్నసైజు చెరువుల్ని తలపిస్తున్నాయి. దాంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు. ఈ గుంతల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని జంకుతున్నారు. ఎన్నికల సమయంలో నాయకుల హామీలు మాటలకే పరిమితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో.. కొత్త రోడ్ల మాట దేవుడెరుగు ఉన్న వాటికీ మరమ్మతులు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 70 శాతం రోడ్లు గుంతలమయంగా మారిపోయాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు రోజూ తిరిగే రహదారుల పరిస్థితీ మారడంలేదు. స్పీకర్ తమ్మినేని సీతారాం నియోజకవర్గమైన ఆమదాలవలసలో.. శ్రీకాకుళం నుంచి పాలకొండ వెళ్లే ప్రధాన రహదారిలో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ దారిలో కొల్లివలస కూడలి వద్ద పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి చెరువులను తలపిస్తున్నాయి. రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయం పుడుతోందని... స్థానికులు వాపోతున్నారు. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనడానికి తరచూ తమ్మినేని సీతారాం రోజూ ఇదే రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్నా.. ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని... స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.