Gas Leakage In Chemical Factory : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారవ రెవెన్యూ పరిధిలోని సరాక రసాయన పరిశ్రమలో విష వాయువు లీక్ అయ్యి ఒకరు మృతి చెందారు. మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో పార్వతీపురానికి చెందిన షిప్ట్ ఇన్చార్జ్ బోగి ప్రసాదరావు మృతి చెందగా, పూసపాటిరేగ మండలం లంకలపల్లిపాలెంకు చెందిన నాగరాజు పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
నిన్న సాయంత్రం ఐదున్నర సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంగతిని కర్మాగార యాజమాన్యం గోప్యంగా ఉంచింది. జేఆర్ పురం పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.