Extreme Drought Conditions in Andhra Pradesh: కరవు తాండవిస్తున్నా కల్లబొల్లి మాటలతో కప్పిపుచ్చే యత్నం - రైతుల కన్నీరు కనిపించడం లేదా? Extreme Drought Conditions in Andhra Pradesh: ఉత్తరాంధ్రలోని పలాస నియోజకవర్గం మోదుగుల పుట్టి గ్రామానికి చెందిన షణ్ముఖరావు అనే రైతు మాటలు.. రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 9.90 లక్షల ఎకరాలలో నాట్లు వేస్తే సగం విస్తీర్ణంలో పంట దెబ్బతింది.
చాలా చోట్ల పశువుల మేతకు వదిలేస్తున్నారు. రైతులు ఎకరాకు 30 వేలకుపైగా నష్టపోతున్నారు. అనకాపల్లి జిల్లాలో 1.10 లక్షల ఎకరాలలో వరి నాట్లు వేయగా.. అందులో సుమారు 25 వేల ఎకరాల్లో పైరు ఎండిపోయింది. తాండవ, పెద్దేరు, కోనాం జలాశయాల్లో నీటిమట్టాలు అడుగంటి ఆయకట్టుకు నీరందడం లేదు.
కడుపు నిండి'నోళ్లకేం' తెలుసు కరవు కష్టం - కొద్దిపాటిదే అన్నట్లుగా జగన్ తీరు
వర్షాభావ పరిస్థితులు కారణంగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో వేలాది ఎకరాల వరి పంట ఎండిపోతోంది. రబీ సీజన్లో పలాస నియోజకవర్గానికి వంశధార ఎడమ కాలువ ద్వారా నీరు అందించాల్సి ఉంటుంది కానీ దాదాపు 4 ఏళ్ల నుంచి చుక్క నీరందక రైతులు వరుస నష్టాలు చూస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యం కారణంగా కాలువలు పూడిక తీయకపోవడంతో సమయానికి నీరందక పంట ఎండిపోతుంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో వేరుసెనగ సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. సకాలంలో వర్షం రాకపోవటంతో సగానికి పైగా విస్తీర్ణంలో రైతులు వేరుసెనగవిత్తనం వేయలేకపోయారు. ఉమ్మడి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షం కురవటంతో విత్తనం వేసిన రైతులు, పంట కీలక సమయంలో 50 రోజులపాటు చినుకు రాలకపోవటంతో పంట పూర్తిగా ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు.
కరవు తాండవం.. పట్టించుకోని పాలకులు.. వలసలే దిక్కు అంటున్న రైతులు
అనంతపురం జిల్లాలో వాన జాడలేక 1.30 లక్షల హెక్టార్లలో రైతులు ఏ పంట విత్తనం వేయలేకపోయారు. వేరుసెనగ పంట ఏటా రెండు లక్షల 31 వేల హెక్టార్లలో సాగవుతుండగా, ఈసారి ఖరీఫ్ లో లక్ష 22 వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో లక్ష 52 వేల హెక్టార్లలో రైతులు ఏ పంట సాగు చేయలేక భూమిని బీడు పెట్టాల్సి వచ్చింది. ఏటా వేరుసెనగ రెండు లక్షలల హెక్టార్లలో సాగుచేస్తుండగా, ఈసారి కేవలం 56 వేల హెక్టార్లలో వర్షాధారంగా సాగుచేసిన రైతులకు ఎకరాకు కనీసం 40 కేజీల దిగుబడి కూడా రాలేదు. ఇంతటి నష్టం ఎప్పుడూ చూడలేదని వేరుసెనగ రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సన్న బియ్యం ఎక్కువగా పండించే నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీరు ఇవ్వకపోవడంతో అధిక శాతం మాగాణి బీడుగా మారింది. కాల్వలకు సరిపడా నీరివ్వక కృష్ణా డెల్టాలోని బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ వేలాది ఎకరాలు నెర్రెలిచ్చాయి. కొన్ని చోట్ల వరినాట్లూ వేయలేదు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సకాలంలో వర్షాలు కురవక పంటలన్నీ ఎండుతుంటే.. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి రైతులకు మరితం శాపంగా మారింది.
రాష్ట్రంలో కరువు ఛాయలు కనిపిస్తున్నా మొద్దు నిద్రతో కళ్లు తెరవని వైసీపీ ప్రభుత్వం