శ్రీకాకుళం జిల్లాలోని పట్టణాల్లో అన్ని వీధులు కంటైన్మెంట్ జోన్లలోకి వెళ్తున్నాయి. గ్రామాల్లో కూడా కంటైన్మెంట్ జోన్‌ల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 66 మంది మృత్యువాత పడటం అందరినీ కలవరపెడుతోంది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశముంది. దీంతో వైరస్ నిర్ధరణ పరీక్షలు ముమ్మరం చేయడమే ఇందుకు కారణమని అధికారులు అంటున్నారు.
రోజుకు సగటున 4 వేల పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. 24 గంటల వ్యవధిలోనే ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకూ ఫలితాల్లో జాప్యం వస్తేనే వందలాది కేసులు బయటపడగా పరీక్షలు వేగవంతం చేస్తే బాధితులు ఎక్కువగా వెలుగుచూసే అవకాశముంది.
ఎటువంటి లక్షణాలు కనిపించినా ప్రజలే స్వచ్ఛందంగా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ నివాస్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష కిట్లు, సరికొత్త యంత్రాలు జిల్లాకు చేరుకోవడంతో నిర్ధరణ పరీక్షలు ఊపందుకున్నాయి. యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
కొవిడ్ కేర్ సెంటర్లలను ఏర్పాటు చేసింది. అన్ని వసతులు ఉంటే హోం ఐసోలేషన్‌ల్లో వైద్యం అందించేందుకు నిర్ణయించింది. కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలకు శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన వీడీఆర్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ఇక్కడ రోజుకు రెండు వేల నమూనాలను పరీక్షించే సామర్థ్యం మాత్రమే ఉండడం.. అంతకుమించి నమూనాలు సేకరిస్తుండటంతో ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
వైరస్ బాధతులు.. వారి కుటుంబసభ్యుల ఆందోళన దృష్ట్యా కలెక్టర్ నివాస్ ప్రస్తుతమున్న వీడీఆర్ ల్యాబ్‌కు అనుబంధంగా మరో ల్యాబ్ ఏర్పాటు చేసి పరీక్షల నాలుగు వేలకు పెంచే దిశగా చర్యలు చేపట్టారు. అలాగే మరోవైపు జిల్లాలోని కొవిడ్ ఆసుపత్రుల్లో పోష్టుల భర్తీ యుద్దప్రాతిపదకన చేస్తున్నారు.