కరోనా నిబంధనలను పక్కన పెట్టి గుట్టుగా గుడిలో వివాహం జరిపించేసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. పాతపట్నం మండలానికి చెందిన యువకుడికి, కంచిలి మండలంలోని యువతితో.. ఈ నెల 25న రాత్రి 8 గంటలకు వివాహ ముహూర్తం నిర్ణయించారు. లాక్ డౌన్ అమల్లో ఉండడం.. పాతపట్నంలోనూ పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు పెళ్లికి అనుమతివ్వలేదు.
ఆ రోజున వివాహాన్ని అడ్డుకుని అందర్నీ పంపిచేశారు. అయితే... ఎలాగైనా పెళ్లి జరపాలనుకున్నారు యువతీయువకుల తల్లిదండ్రులు. అదే రోజు మరో ముహూర్తానికి ఒడిశా సరిహద్దు ప్రాంతమైన గిరిజన గ్రామం కుంబరినౌగాంలోని ఓ ఆలయంలో వివాహం చేసేశారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు వారికి వైద్యపరీక్షలు నిర్వహించారు. హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. కంచిలి పోలీసులు వీరిపై కేసు నమోదుచేశారు.