ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమ్మలేదు.. తిరిగిరాదు... ఆసుపత్రిలో శిశువు..! - women postpartum died news in srikakulam

పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.. ఆ తల్లి.. ! కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఇంతలోనే విషాదం అలముకుంది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి కన్నుమూసింది. ఆ సంగతిని ఆసుపత్రి గంటలకొద్దీ దాచిపెట్టింది. శ్రీకాకుళం ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఈ ఘటనతో మృతురాలి బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఆసుపత్రిపై దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అప్పుడే పుట్టిన శిశువు చిన్న పిల్లల వార్డులో ఉన్నాడు..

a-women-postpartum-died-at-srikakulam

By

Published : Oct 23, 2019, 10:23 AM IST

Updated : Oct 23, 2019, 5:57 PM IST


బాలింత మృతికి వైద్యలు.. సిబ్బందే కారణమంటూ శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిపై బాధితులు దాడికి దిగారు. దీంతో మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన సంధ్య అనే మహిళ ప్రసవం తరువాత కన్నుమూసింది. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది బంధువులకు చెప్పకపోవడం.. వైద్యం పేరుతో కాలయాపన చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. మహిళ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహంతో ఆసుపత్రి అద్దాలు పగులగొట్టారు.

బాలింత మృతి... బంధువుల ఆందోళన

ఆనందం.. అంతలోనే విషాదం

సరుబుజ్జిలి మండలం మూలసవళాపురం గ్రామానికి చెందిన గర్భిణి కరపాటి సంధ్యను 19వ తేదీ రాత్రి 8.35కి ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు ప్రసూతి వార్డులో ఉంచారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేదని, పలుమార్లు అడిగినా ఏ విషయం చెప్పకుండా జూనియర్‌ వైద్యులు కసురుకున్నారని భర్త రామారావు తెలిపారు.

సోమవారం సాయంత్రం నొప్పులు బాగా ఉన్నాయని చెప్పినా సరిగ్గా సమాధానం చెప్పలేదన్నారు. మంగళవారం ఉదయం 6.10కి మగబిడ్డకు సంధ్య జన్మనిచ్చింది. ఆ తరువాత నుంచి ఆమె స్పృహలోకి రాలేదు. ఐసీయూలోకి తీసుకువెళ్లారు. వైద్యులను ఎన్నిసార్లు అడిగినా రక్తం చాలదు తీసుకురావాలని చెబుతూ కాలయాపన చేశారు. ఒంటి గంట సమయంలో ఆందోళన చేస్తే విశాఖపట్నం కేజీహెచ్‌కి రిఫర్‌ చేస్తామని వైద్యులు చెప్పారు. ఆ సమయంలో గట్టిగా ప్రశ్నిస్తే సంధ్య చనిపోయిందని అసలు విషయం చెప్పారు. శిశువును చిన్నపిల్లల వార్డులో ఉంచి వైద్యం చేస్తున్నారు.

తీవ్ర ఉద్రిక్తత

జరిగిన ఘటనతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అద్దాలు పగులగొట్టడంతో వైద్యులంతా ఓ గదిలోకి వెళ్లిపోయారు. సూపరింటెండెంట్‌ ఫోన్‌ చేయడంతో పోలీసులు ప్రత్యేక బలగాలను అక్కడికి పంపించారు. మృతి చెందిన బాలింతను మార్చురీలోకి తీసుకువెళ్లేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించగా ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో ఐసీయూలోనే ఉంచేశారు.

ఉదయం ఆమె కన్నుమూయగా...అర్ధరాత్రి వరకూ అక్కడే ఉంచారు. మృతురాలి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి ఆసుపత్రి ముందు బైఠాయించారు. డీఎస్పీ చక్రవర్తి బందోబస్తుతో చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైద్యులు క్షమాపణ చెప్పాలని, తమలా మరో కుటుంబం నష్టపోకూడదని వారు పట్టుబట్టారు. వైద్యులు తాము బాలింతను కాపాడేందుకే ప్రయత్నించామని చెప్పడం.. పోలీసులు సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.

ఇదీచూడండి.బోటు వెలికితీతతో ముగిసిన పాపికొండల విషాదయాత్ర

Last Updated : Oct 23, 2019, 5:57 PM IST

ABOUT THE AUTHOR

...view details