కరోనా ఆ యువకుడికి ఉపాధి లేకుండా చేసింది. ఖాళీగా ఉంటున్న సమయంలో ప్రేమలో పడ్డాడు. కొద్దిరోజుల్లో ప్రేయసి పుట్టినరోజు ఉందని తెలుసుకొని ఆమెకు బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కానీ పరిస్థితులు సహకరించట్లేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. బాగా ఆలోచించాడు. దొంగతనం చేద్దామని ప్రణాళిక వేసుకున్నాడు. అమలు చేసి విఫలమయ్యాడు. పోలీసులకు దొరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన ఇచ్ఛాపురం పట్టణంలో సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అమిత్‌బర్దార్ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.
ఒడిశాలోని రాయగడ జిల్లా గుణుపూర్ బ్లాక్ చలకంబ గ్రామానికి చెందిన సూరజ్ కుమార్ కద్రకా పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తరువాత చదువు మానేసి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వెళ్లి రొయ్యల చెరువుల వద్ద కాపలాదారునిగా పని చేశాడు. కొంతకాలానికి విశాఖ వచ్చేసి ఓ హోటల్‌లో సర్వర్‌గా కొనసాగాడు. కొవిడ్ నేపథ్యంలో హోటళ్లు మూతపడటంతో స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆ సమయంలో అతని బాబాయ్ అనారోగ్యంతో భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిసి సాయానికి వెళ్లాడు. అక్కడే ఓ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆమె పుట్టినరోజుకు బంగారు గొలుసు బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. కానీ చేతిలో డబ్బులులేకపోవడంతో దొంగతనానికి సిద్ధమయ్యాడు. సినిమాల ప్రభావంతో ఓ ప్రణాళిక రచించుకున్నాడు. ఆన్‌లైన్‌లో రూ.2 వేలు పెట్టి బొమ్మ తుపాకీ కొన్నాడు. ఈనెల 9న ఇచ్ఛాపురం వచ్చి జనాల రద్దీ లేని సమయంలో వ్యాపారి ఒక్కరే ఉన్న జీకే జ్యూయలరీని ఎంపిక చేసుకున్నాడు. అనుకున్న ప్రకారం ప్రణాళిక అమలు చేశాడు. బొమ్మ తుపాకీ చూపించి వ్యాపారిని బెదిరించాడు. రూ.90 వేలు విలువైన మూడు గొలుసులతో ఉడాయించాడు. క్షణాల్లో తేరుకున్న వ్యాపారి కేకలు వేస్తూ బయటకొచ్చారు. స్థానికులతో కలిసి వెతికారు. ఇంతలో ఇచ్ఛాపురం పోలీసులు నిందితుడిని గుర్తించి వెంబడించారు. అలవాటులేని పని కావడంతో భయపడిన నిందితుడు స్థానిక కోటీ అపార్టుమెంట్‌లోకి చొరబడి ఆయాసంతో పడిపోయాడు. పోలీసులు పట్టుకొని విచారించగా నిజం బయటకు వచ్చింది.
అప్రమత్తంగా ఉండాలి: