ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తండ్రి తాపీ మేస్త్రీ.... తనయుడు ఎవరెస్ట్ అధిరోహకుడు

సప్తఖండాల్లో ఉన్న ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలనేది ఆ యువకుని కోరిక. కుటుంబ పరిస్థితులు బాగాలేవు అయినా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. సంకల్పబలంతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని విజయ శిఖరాలను అందుకుంటున్నాడు. అడ్డంకులన్నీ అధిగమించి, నిలువెత్తు శిఖరాన్ని అధిరోహించాడు. ఆ తరువాత నాలుగు ఎత్తయిన శిఖరాలను అధిరోహించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

By

Published : Jun 10, 2019, 9:02 AM IST

ఎవరెస్ట్ అధిరోహకుడు

విజయ 'శిఖరం'

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన షేక్ హిమామ్ షాకు ప్రపంచంలోని ఎత్తయిన శిఖరాలను అధిరోహంచాలనేది ఆశయం. కానీ కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. తాపీ మేస్త్రీ పనిచేసే తండ్రి మస్తాన్ ఆదాయంపైనే కుటుంబమంతా ఆధారపడి ఉంది. అయినప్పటికీ వెనుకడుగు వేయలేదు ఆ యువకుడు. 2018లో రాష్ట్రం నుంచి ఎవరెస్టు అధిరోహించే బృందంలో హిమామ్‌ అగ్రగామిగా నిలిచాడు. ఎవరెస్టు శిఖర అధిరోహణకు రాష్ట్రం నుంచి 130 మంది ఉత్సాహం చూపగా.. చివరికి అవకాశం దక్కింది ఐదుగురికి మాత్రమే. ఇందులో ఒంగోలుకు చెందిన హిమామ్‌ ఒకరు. మైనస్ 40 డిగ్రీల అతి శీతల వాతారణంలో ఈ ఐదుగురు నడక ప్రారంభించగా వీరిలో మొట్టమొదటిగా షేక్‌ హిమామ్‌ షా చేరుకున్నాడు. టిబెట్‌ మీదుగా ఎవరెస్టు శిఖరం ఎక్కడమంటే మరణంతో ప్రయాణం చేయడమే... అలాంటి ప్రయత్నాన్ని ఆయన ఆత్మవిశ్వాసంతో విజయవంతంగా ముగించాడు.

ప్రకాశం జిల్లా నుంచి ఒకేఒక్కడు
ఎంతో కఠినతరంగా ఉండే 9 దశలను దాటుకొచ్చి, పర్వతారోహణకు అర్హత సాధించిన హిమామ్​షా... 2018 మే 16వ తేది అర్ధరాత్రి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. భారత్ తరపున ఉత్తరం వైపు నుంచి పర్వతాన్ని ఎక్కిన మొదటివ్యక్తి హిమామ్ కాగా... 2018 లో ఎవరెస్టు ఎక్కిన వారిలో మొదటివాడు ఇతడే. ప్రకాశం జిల్లా నుంచి ఎవరెస్టును అధిరోహించిన తొలి వ్యక్తి హిమామ్.

విజయపరంపర
తొలిప్రయత్నం విజయవంతం కావడంతో ప్రపంచంలో ఏడు ఖండాల్లో ఉన్న ఏడు ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలనే ప్రయత్నంలో రెండో సారి యూరోప్‌ ఖండంలో ఎల్‌బర్స్ పర్యతంపై 5,643మీటర్లు, ఆఫ్రికా ఖండంలో కిలిమంజూరో (5,895 మీటర్లు), దక్షిణ అమెరికా ఆకాంకుగ్వా పర్వతం (6,962మీటర్లు) శిఖరాలను అధిరోహించాడు. తొలి పర్వతాహరోణకు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థిక సహాయం అందించగా.. రెండింటికి ఒంగోలుకు చెందిన ఆనంద్‌ గ్రానైట్స్ అధినేత శ్రీధర్‌ స్పాన్సర్‌ చేశారు.

ఆర్మీలో చేరాలని కోరిక
చిన్నప్పటి నుంచి కరాటే అన్నా.. క్రికెట్ అన్నా ఎంతో ఇష్టపడే హిమామ్ కరాటేలో జిల్లాస్థాయిలో 7 సార్లు, రాష్ట్ర స్థాయిలో 4 సార్లు, జాతీయ స్థాయిలో ఒకసారి ఛాంపియన్ గా నిలిచాడు. ఎన్​సీసీలో సీ సర్టీఫికెట్ కూడా సాధించాడు. ఏడు ఖండాల్లో ఉన్న ఎత్తయిన పర్వతాలన్నీ అధిరోహించడమే తన లక్ష్యంగా పేర్కొంటున్న హిమామ్ ఏనాటికైనా భారత సైన్యంలో పారా కమాండోగా చేరి దేశానికి సేవలందించాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details