తెదేపా వృద్ధ అభిమానిపై వైకాపా కార్యకర్తల దాడి - ycp
తెదేపా కార్యకర్తలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వృద్ధుడు అని కూడా చూడకుండా ప్రకాశం జిల్లాలో ఓ వృద్ధుడిపై వైకాపా కార్యకర్తలు కొడవలతో దాడి చేశారు. తెదేపాకు ఓటు వేసినందుకే తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించాడు.
ఎన్నికలు జరిగి నెలలు గడుస్తున్నా గ్రామాల్లో మాత్రం దాని ప్రభావం తగ్గలేదు. ప్రకాశం జిల్లా పొందూరు పంచాయతీ లక్ష్మక్క పల్లెలో తెదేపా కార్యకర్తపై వైకాపా అభిమానులు దాడి చేశారు. గ్రామస్తులు మద్దినేని నరసింహారావు, కుమారుడు శ్రీధర్ మరో నలుగురు వైకాపా కార్యకర్తలతో కలిసి తెదేపా కార్యకర్త సుబ్బారాయుడుపై రాళ్లు, కొడవలితో దాడి చేశారు. భాదితుడి తలకు గాయం కావటంతో కుటుంబసభ్యులు ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మనవరాలిని పాఠశాలలో వదిలిపెట్టడానికి వెళ్లి వస్తున్న తనపై అన్యాయంగా దాడి చేశారని సుబ్బారాయుడు అన్నారు. ఎన్నికల్లో వైకాపా విజయం సాధించిన తర్వాత నుంచి ఎదో ఒక కారణంతో తమని దుర్భాషలాడుతున్నారని తెలిపారు.