జడ్పీటీసీ ఎన్నిక కారంచేడులో ఆసక్తికరంగా మారింది. వారిద్దరు దాయాదులే కాదు ఒకే పేరు కలిగిన వారు కావడం విశేషం. అభ్యర్థులిద్దరూ ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామానికి చెందినవారు. అంతేకాకుండా నివాసాలు కూడా మాస్కో బజార్‌లో పక్కపక్కనే ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినవారే. గ్రామానికి చెందిన వ్యక్తులనే ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరి వయస్సూ 45 ఏళ్లే కావడం గమనార్హం. ఒకప్పుడు రెండు కుటుంబాలూ తెదేపాలోనే ఉన్నాయి. ఇప్పుడు జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీలో ఉన్నారు. గెలుపు కోసం దాయాదులిద్దరూ తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో తెదేపా పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా.. కారంచేడులో మాత్రం పోటీ కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని హోరాహోరీ ప్రచారం నిర్వహిస్తున్నారు.
తెదేపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న యార్లగడ్డ రజనీ రాజకీయాలకు కొత్త. వారి కుటుంబానికి మాత్రం రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె మామ యార్లగడ్డ సీతారామాంజనేయులు సర్పంచిగా పనిచేశారు. గ్రామ మునసబుగానూ బాధ్యతలు నిర్వర్తించారు. సీతారామాంజనేయులు తండ్రి సుబ్బారాయుడు స్వాతంత్య్ర సమరయోధుడు. తెదేపా ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం పార్టీలో కొనసాగుతోంది. తెదేపా నాయకుల విజ్ఞప్తి మేరకు జడ్పీటీసీ అభ్యర్థిగా యార్లగడ్డ రజనీ రంగంలోకి దిగారు.