ప్రకాశం జిల్లా కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు మండలాల్లో తోపుడు బండ్ల నిర్వహకులు సుమారు 300 మంది ఉన్నారు. సింగరాయకొండ, టంగుటూరు, కొండేపిలో మరో 200 మంది ఉంటారు. వారు పండ్లను నెల్లూరు, బెంగళూరు, కడప ప్రాంతాల నుంచి తెచ్చి విక్రయిస్తుంటారు. సోడాబండి, పూలకొట్లు, తినుబండారాల దుకాణాల నిర్వాహకులు మరో 500 వరకూ ఉంటారు. ఇలాంటి వారందరూ తక్కువ సమయంలో విక్రయాలు నిర్వహించలేక అప్పులు పాలవుతున్నామని చెబుతున్నారు. బాగా వ్యాపారం జరిగిన కాలంలో రోజూ సుమారు రూ. కోటి వరకూ విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం రూ. 20 లక్షలకు మించడం లేదని మార్కెట్ నిర్వహకులు చెబుతున్నారు.
నష్టం వస్తోంది
గుడ్లూరు బస్టాండు కూడలిలో తోపుడు బండిపై పండు అమ్ముతున్నాను. సాధారణ సమయాల్లో రోజుకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ విక్రయాలు సాగించేవాడిని. ప్రస్తుతం అమ్మకాలు సాగించేందుకు ఆరు గంటల సమయం మాత్రమే ఉండడంతో చుట్టు పక్కల గ్రామాల వారు ఇక్కడికి రావడం తగ్గించారు. దాంతో రోజుకు కేవలం రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు మాత్రమే విక్రయాలు సాగిస్తున్నా. తెచ్చిన సరకు ఎక్కువ కాలం నిల్వ ఉండాల్సి రావడంతో నష్టం వస్తోంది. ఇదే పరిసితి మరి కొంతకాలం కొనసాగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
- జి.బుజ్జి, గుడ్లూరు