ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో అనేక సమస్యలున్నాయని, ప్రభుత్వాలు మారిన వాటిని పరిష్కరించడంలేదని పలు ప్రజాసంఘాల నేతలు అన్నారు. ఒంగోలు మెడికల్ అసోసియేషన్ హాలులో... ఒంగోలు సిటిజన్ ఫోరమ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రతిపాదన తెస్తున్నందున సంతనూతలపాడు నియోజకవర్గాన్ని బాపట్ల పార్లమెంట్లో కాకుండా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో చేర్చాలని వక్తలు కోరారు. గ్రానైట్ పరిశ్రమ, సాగు, తాగునీరుకు ప్రధాన వనరుగా ఉన్న గుండ్లకమ్మ ప్రాజెక్టు, రామతీర్థం జలాశయం.. జిల్లా పరిధిలోకి వస్తాయన్నారు. ఒంగోలు కార్పొరేషన్ స్థాయికి ఎదిగినా సమస్యలు మాత్రం పరిష్కారంకాలేదన్నారు.
ముఖ్యంగా పోతురాజు కాల్వ ఆధునీకరణకు నిధులు మంజూరైనా పనులు మాత్రం జరగడం లేదన్నారు. దీంతో చిన్నపాటి వర్షానికే శివారు కాలనీలతో పాటు, ఒంగోలు పట్టణం ముంపునకు గురవుతోందని ప్రజాసంఘాల నేతలు అన్నారు. ఒంగోలులో భూగర్భ మురుగు కాల్వలు ఏర్పాటుచేయాలన్నారు. యూనివర్సిటీ, సైన్స్ ప్లానిటోరియం, స్టేడియం, వేయి మంది పట్టే సామర్థ్యంతో ఇండోర్ ఆడిటోరియం నిర్మించాలని సమావేశంలో తీర్మానించారు.
ఈ సమావేశంలో... ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారేళ్ల సుబ్బారావు, చైతన్య స్వరభారతి అధ్యక్షుడు, సీపీఐఎం, ఎల్.న్యూ డెమోక్రసీ, ప్రజానాట్యమండలి, వైకాపా నాయకులు, మెడికల్ అసోసియేషన్, తెదేపా నేతలు, జనసేనా నాయకులు , ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకుడు కొల్లా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :'జగన్ తలుచుకుంటే తెదేపా ఖాళీ అవుతుంది'