అదనపు కట్నం కోసం వేధింపులు... గర్భిణి మృతి - markapuram crime news
ప్రకాశం జిల్లాలో విషాదం ఘటన జరిగింది. అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధిస్తూ... సరైన ఆహారం అందించకపోవంటో గర్భిణి కన్నుమూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్త వేధింపులకు పాల్పడటంతో గర్భిణి మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా కోమరోలు మండలం బెడుసుపల్లె ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దమ్ము తిరుపతికి మార్కాపురానికి చెందిన గురజాల చెన్నమ్మ కుమార్తె తిరుమలేశ్వరి(27)తో రెండేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఒక కుమార్తె ఉంది. ప్రస్తుతం తిరుమలేశ్వరి అయిదో నెల గర్భిణి. కొంత కాలంగా అదనపు కట్నం కోసం భర్త, అత్త ఓబులమ్మ కలిసి వేధించేవారని పోలీసులు తెలిపారు. పోషకాహారం అందక అనారోగ్యానికి గురవటంతో మార్కాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆసుపత్రిలోనే మృతి చెందారు. మృతురాలి తల్లి చెన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఏఎస్సై ఎ.గోపాలకృష్ణ తెలిపారు. తహసీల్దారు ఆదేశాల మేరకు శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.