కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన తాడంకి రాజు, అనూష దంపతుల కుమారులు భరత్(8), భవిష్(7) పుట్టినప్పటి నుంచి మానసిక వికలాంగులు. కనీసం కూర్చోలేరు. నుంచోలేరు. ఆ దంపతులకు కూలి పని చేసుకుంటేనే పూట గడిచేది. పిల్లలకు పింఛను ఇప్పించాలని గత 8 నెలలుగా అధికారులను మొరపెట్టుకున్నా ఫలితంలేదు. గ్రామ సచివాలయ రికార్డుల్లో రాజు ప్రభుత్వ ఉద్యోగి అని, కారు ఉందని, ఇన్‌కంటాక్స్ కడుతున్నట్లుగా ఉందని, పింఛను రాదని చెప్పారు. కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నామని, వాహనం లేదని ధ్రువపత్రాలు అందజేసినా కనికరం చూపడం లేదని ఆ దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు.
మమ్మల్ని ఆదుకోండి..సారూ..
ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని నాంచారమ్మ కాలనీకి చెందిన దివ్యాంగుడు ఎం.మల్లికార్జునరావు(31)కు రెండు కాళ్లు, చేతులు పనిచేయవు. ఆయన భార్య కూడా దివ్యాంగురాలే. వీరికి మూడో తరగతి చదివే కుమారుడు ఉన్నాడు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి రూ.3 వేల పింఛను మాత్రమే వస్తోంది. ఇల్లు గడవడం ఇబ్బందిగా ఉందని.. తనకు రూ.10 వేల పింఛను ఇప్పించాలని వేడుకుంటున్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కూడా విన్నవించినట్లు తెలిపారు.