FLUORIDE ISSUE: కదలకుండా కాసేపు ఉండాలంటేనే చాలా కష్టంగా భావిస్తుంటాం. అలాంటిది జీవితాంతం మంచానికే పరిమితం కావడం అంటే ..మాటలా.. ఆ బాధ వర్ణనాతీతం. ఫ్లోరైడ్ రక్కసి బారిన పడి కీళ్ల నొప్పులతో, ఇతర సమస్యలతో బాధపడే వారు కొందరైతే.. పూర్తి అంగవైకల్యానికి గురై .. సొంత అవసరాలూ తీర్చుకోలేని దుస్థితి మరికొందరిది. తమకొచ్చిన ఈ కష్టం కనీసం తర్వాతి తరాల వారికైనా రాకుండా చూడాలంటున్నారు ప్రకాశం జిల్లా వాసులు. జిల్లాలోని ఫ్లోరైడ్ బాధితుల వెతలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..
ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ భూతం ఎంతోమంది జీవితాలను వేధిస్తోంది. 20 మండలాల్లో తాగునీటిలో 1.5 నుంచి 14 PPM వరకు ఫ్లోరైడ్ ఉండడంతో.. ఆయా ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. దశాబ్దాల క్రితమే సమస్యను గుర్తించినా..శాశ్వత పరిష్కారానికి పాలకులు, అధికారులు చర్యలు తీసుకోలేదన్నది ప్రజల వాదన. గత్యంతరం లేకే ఫ్లోరైడ్ నీటినే తాగుతూ ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. పొదిలి మండలం రాజుపాలెంలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు 50 మంది ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు. అంగవైకల్యంతో ఏళ్లతరబడి మంచాలకే పరిమితమై.. కనీసం ఆదరించే వారు లేరంటూ చెమ్మగిల్లిన కళ్లతో చెబుతున్నారు.
"ఈ అన్నం తినమనే వారు లేరు. నన్ను పట్టించుకునే వారు ఎవరూ లేరు. ఎటూ తిరగలేను. కనీసం నాకు సహాయం చేయడానికి కూడా లేరు"-చిన్నయోగమ్మ, ఫ్లోరైడ్ బాధితురాలు, రాజుపాలెం
"తాగితే గుక్కెడు నీళ్లు తాగేది.. లేకపోతే పస్తులు ఉండాల్సిందే. సాయం చేయడానికి ఎవరూ లేరు. ఒక్కోసారి వండుకోవడం చేతకాక అలాగే ఉండాల్సిన పరిస్థితి"-పెద్దయోగమ్మ, ఫ్లోరైడ్ బాధితురాలు, రాజుపాలెం